Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ వీడలేదు. ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చి న తీర్పును హైకోర్టులో బిఆర్‌ఎస్ సవాల్ చేయడంతో కేసు ఎటు దారి తీస్తుందోనన్న అనుమానా లు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. పశ్చిమ బెంగాల్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యే ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని కోల్‌కత్తా హైకోర్టు రద్దు చేసిన ఉదంతంతో ఇక్కడా పునరావృత్తమవుతుందా? అనే చ ర్చ ఆరంభమైంది. అనర్హత పిటిషన్లపై మీరు ఇ చ్చిన తీర్పుపై తమకు వివరణ ఇవ్వాలని హైకోర్టు స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు నోటీసు జారీ చేస్తూ కేసును ఈ నెల 16న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్‌ను మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకూ కోర్టు నో టీసులు జారీ చేసింది.

అనర్హత పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చడంతో ఊపిరి పిల్చుకున్న ఎమ్మెల్యేలు టి.ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రా వు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రె డ్డి, అరికెపూడి గాంధీ, కె.సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్ గుం డెల్లో గుబులు ఆరంభమైంది. అందుకు కారణం లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి టిక్కెట్‌పై గెలుపొందిన ముకుల్ రాయ్ కొంత కా లానికి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బిజెపి నేతలు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయించిన ట్లు అన్ని సాక్షాధారాలు ఉన్నాయంటూ హైకోర్టు ధర్మాసనం సదరు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెం గాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున తమకు న్యాయం జరగదని బిజెపి తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వాదన వినిపించారు. కానీ కోర్టు తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగించింది.

రాష్ట్రంలోని పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలోనూ అనేక మలుపులు తిరిగి చివరకు ఈ నెల 11న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించినట్లు సరైన సాక్షాధారాలు లేవంటూ స్పీకర్ పేర్కొంటూ ఆ పది మందిపై దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చారు. దీంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి.కేసు పూర్వాపరాల్లోకి వెళితే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు క్రమేణా వేర్వేరుగా కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాకుండా 2024లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (ఖైరతాబాద్) పోటీ చేశారని, ఆయన పోటీ చేసినట్లు ‘బి-ఫాం’ జిరాక్స్ ప్రతినీ స్పీకర్‌కు అందజేశామని,

ఏఐసిసి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో దానం పేరు ఉండడాన్నీ సాక్షాధారంగా చూపించామని బిఆర్‌ఎస్ అప్పటి పిటిషన్‌లో పేర్కొంది. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్) తన కుమార్తె కడియం కావ్య లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు బాజప్తా ప్రచారం చేశారని బిఆర్‌ఎస్ మరో పిటిషన్‌లో పేర్కొంది. మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రకటించుకోవడం, ముఖ్యమంత్రితో ఫొటోలు దిగడం, కండువాలు కప్పించుకోవడం వంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వార్తల క్లిప్పింగ్స్‌నూ స్పీకర్‌కు సమర్పించామని బిఆర్‌ఎస్ వాదన. చివరకు స్పీకర్ వారెవ్వరూ పార్టీ మారినట్లు తమకు సరైన సాక్షాధారాలు చూపించనందున కేసును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దానంపై తొలుత ఏలేటి

ఇదిలాఉండగా స్పీకర్ తీర్పు వెలువరించిన తర్వాత బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తొలుత ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత ఏడు మంది ఎమ్మెల్యేలపై బిఆర్‌ఎస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. అనంతరం రెండో రోజున మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కె. సంజయ్, కడియం శ్రీహరిపై పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపున గండ్ర మోహన్ రావు పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహీయుద్దీన్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 16న విచారణ చేపట్టనున్నది.