Reading Time: < 1 minute

హైదరాబాద్: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన నివాసం నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు కారణం ఏంటంటే.. ఎపి సిఎం చంద్రబాబు‌ నాయుడు అరెస్టైన సమయంలో ఆయన ఆ కేసుల నుంచి బయట పడాలని గణేష్ మొక్కుకున్నారట. ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకొనేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఈ నెల 19న ఉదయం 9 గంటలకు ‘సంకల్ప యాత్ర’ ప్రారంభిస్తానని తెలిపారు.

‘‘మన నాయకుడు, దేశం గర్వించే దార్శనీకుడు, చంద్రబాబుపై వేసిన అభాండాలు పోవాలని.. జైలు నుంచి ఆయన బయటకు రావాలని సుప్రీంకోర్టు గడపపై నిలుచొని శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రార్థించా. ‘నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర’ చేస్తానని మొక్కుకున్నా. ప్రతి తెలుగువాడి ప్రార్థనలతో చంద్రబాబు మళ్లీ అఖండ విజయం సాధించారు. ఇటీవలే కేసులన్నీ కొట్టేశారు. దీంతో నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తు తెచ్చుకుంది. అందుకే అమ్మానాన్నల ఆశీర్వాదాలతో షాద్‌నగర్‌లోని మా ఇంటి ముందు కొబ్బరికొయ కొట్టి పాదయాత్ర ప్రారంభిస్తాను. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం చేసుకుంటాను. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేధన తీర్చిన, నా కోరిక నెరవేర్చిన, నా మాట ఆలకించిన ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నా మొక్కుబడి చెల్లింపు’’ అని బండ్ల గణేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.