
హైదరాబాద్: రాష్ట్ర ఆస్తులు, వనరులను సంరక్షించి పేదలకు సమానంగా పంచడం, తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు, ఆత్మను కాపాడటమే తన లక్ష్యమని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆస్తుల సంపాదన కోసమో.. వ్యాపారాన్ని విస్తరించుకునేందుకో తాను రాజకీయాల్లోకి రాలేదని, ఒక లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైనీ బొగ్గు బ్లాక్ లకు టెండర్లు పిలిచింది.. సింగరేణి సంస్థ అని తెలియజేశారు. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో అడ్డగోలు రాతలు రాశారని, కట్టుకథ, పిట్టకథలు అల్లి ప్రజలను మభ్యపెట్టేలా కథనం రాశారని భట్టి విమర్శించారు.
కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు చెప్పామని, తాను ఎపి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు సన్నిహితుడిని కాబట్టి.. వైఎస్ఆర్ మీద ఉన్న కోపం తన మీద చూపిస్తున్నారని మండిపడ్డారు. తనపై వార్త రాసిన వారికి వేరే వారిపై ప్రేమ ఉందేమో? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను తప్పు దోవ పట్టించే యత్నమని, విభేదాలు సృష్టించే పన్నాగమని ధ్వజమెత్తారు. ఒక పత్రికలో వచ్చిన కథనం వెనుక రాజకీయం ఉద్దేశం ఏమిటో తెలిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని, గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతానని భట్టివిక్రమార్క హామీ ఇచ్చారు.