
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, నటుడు తారాక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎన్‌టిర్‌కు అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్‌టిఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోత్కూపల్లి మాట్లాడారు. పేదివాడి ఆకలి గుర్తించి ఎన్నో పథకాలు ఎన్‌టిఆర్ ప్రవేశ పెట్టారని ప్రశంసించారు. ముఖ్యమంత్రులు మారినా పథకాలు మారడం లేదని, భూమి ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో జీవించి ఉంటారని కొనియాడారు. ఎన్‌టిఆర్ కన్నుమూసి వంద సంవత్సరాలు అయినా ఆయన జీవించి ఉంటారని మోత్కూపల్లి మెచ్చుకున్నారు.
ఎన్‌టిఆర్ తనని తమ్ముడు అని పిలిచేవాడని బాబు మోహన్ గుర్తు చేసుకున్నారు. ఎన్‌టిఆర్ దేవుడు అని, శకపురుషుడని ప్రశంసించారు. ఆయన కన్నుమూశాడని చెప్పడానికి తనకు నోరు రావడంలేదన్నారు. భూమి ఉన్నంత వరకు ఎన్‌టిఆర్ తెలుగు ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటాడని చెప్పారు. మళ్లీ జన్మించి నటుడిగా వెలగాలని, ఎన్‌టిఆర్ తిరిగి వస్తాడని నమ్ముతున్నానని చెప్పారు.