Reading Time: < 1 minute

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా మరో హిందువును కారుతో తొక్కించి మరీ దారుణంగా హత్య చేశారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మీడియా కథనాల ప్రకారం రాజ్‌బరిలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్‌లో రిపోన్ సాహా (30) పనిచేస్తున్నాడు. శుక్రవారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బిఎన్‌పి) రాజ్‌బరి జిల్లా యూనిట్ మాజీ కోశాధికారి అబుల్ హషేమ్ పెట్రోల్ కోసం వచ్చాడు. పెట్రోల్ కొట్టించుకున్నాక డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. రిపోన్ డబ్బు ఇవ్వాల్సిందిగా హషేమ్‌ను అడగ్గా అతడిపైకి కారుతో దూసుకెళ్లాడు. కారు తనపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాల పాలైన రిపోన్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబుల్ హషేమ్‌ను, అతడి కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.