
ఫిరాయింపు ఎంఎల్‌ఎలపై చర్య తీసుకుంటారా?
మమ్మల్ని తీసుకోమంటారా? స్పీకర్ తరపు
న్యాయవాది సింఘ్వీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
స్పీకర్‌కు మరో నాలుగు వారాల గడువు
మన తెలంగాణ/హైదరాబాద్: “మీ క్లయింట్ (స్పీకర్)కు ఇదే చివరి అవకాశం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకుంటారా?, లేక మమ్మల్నే తీసుకోమంటారా?” అని సుప్రీం కోర్టు ధర్మాసనం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్విని ఉద్ధేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ సకాలంలో చర్యలు తీసుకోకుండా జాప్యం చే స్తున్నారని, లోగడ సుప్రీం విధించిన గడువులోగా నిర్ణయం తీ సుకోలేదంటూ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో స్పీకర్‌పై ధిక్కరణ (కంటెంప్ట్) కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసీహ్‌తో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. మీ క్లయింట్ (స్పీకర్)కు ఇచ్చిన గడువులోగా ఎంత మందిపై విచారణ పూర్తి చేశారు?, ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు ?, కేసు పురోగతి ఏమిటీ ? అని ధర్మాసనం న్యాయవాది సింఘ్విపై ప్రశ్నల వర్షం కురిపించింది.
ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు టి. ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్‌పై విచారణ పూర్తి చేసి, వారు పార్టీ ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు లేవంటూ వారిపై దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చడం జరిగిందన్నారు. ఆ తర్వాత తాజాగా ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసులపై తీర్పు వెలువరించారని, వారు కూడా పార్టీ ఫిరాయించినట్లు సరైన ఆధారాలు ఏమీ లేవంటూ కేసును కొట్టి వేశారని చెప్పారు. ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు కె. సంజయ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై తీర్పు వెలువరించాల్సి ఉందన్నారు. అందుకు ధర్మాసనం జస్టిస్ కరోల్, జస్టిస్ మసీహ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. మీ (క్లయింట్)కు ఇంకా ఎంత సమయం కావాలని ప్రశ్నించారు.
ఏలేటి పిటిషన్‌పైనా విచారణ..
ఇదిలాఉండగా బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్శర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పైనా న్యాయవాది ఆంటోని రెడ్డి పిటిషనర్ తరఫున వాదన వినిపించారు. బిఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కొంత కాలానికే లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని, పార్టీ ఫిరాయించరనడానికి ఇది బహిరంగ ఉదాహరణ అని చెప్పారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానంటూ ఇటీవల కాలంలో బహిరంగంగా మీడియా ద్వారా వ్యాఖ్యలు చేస్తున్నా, స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని వినిపించారు. ఈ కేసు రెండు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది.