Reading Time: 2 minutes

 కెసిఆర్ కట్టించిన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న సిఎం రేవంత్‌రెడ్డి

రెడీమేడ్‌గా ఉన్న ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేస్తూ ఫోజులు

మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌రావు ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్: కలిసొచ్చే కా లానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు.. సిఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కెసిఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకపత్రాలు రెడీ మేడ్‌గా తయారై ఉన్నాయని మాజీ మం త్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు విమర్శించారు. తట్టెడు మట్టి తీసింది లేదు, ఒక్క ఇటుక వేసింది లేదు అయినా చనాకా కొరటా, సదర్మాట్ బ్యారేజీలను తామే పూర్తి చేసినట్లు గొప్ప లు చెప్పుకున్న సిఎం సభ చరిత్రలో నిలబడుతుంది అంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉ ద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. క్రెడిట్ కొట్టేయడం మీద ఉన్న శ్రద్ధ.. పాలన మీద, ప్రాజెక్టుల మీద పెడితే ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంద న్నారు. వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే.. గం టె పట్టుకొని ఫోటోలకు పోజులివ్వడం రేవంత్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు. ప్రాజెక్టులు క ట్టడం బిఆర్‌ఎస్ వంతు, వీసమెత్తు కృషి చేయని కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టి మనోభావాల ను అవమానించడం కాంగ్రెస్ వంతు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల పాలనలో చేసింది లేదు, చెప్పుకునేందుకు ఏదీ లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణను కోటి ఎ కరాల మాగాణిగా మార్చేందుకు కెసిఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే.. వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న రేవంత్ అర్భకత్వాన్ని చూసి జాలి వేస్తోందని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిర్మించిందేం లేక కెసిఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణాలకు రిబ్బన్ కట్ చేయడమే రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని చెప్పారు. కెసిఆర్ మహారాష్ట్రతో చారిత్ర క ఒప్పందం కుదుర్చుకొని, రూ. 1200 కోట్లు ఖర్చు పెట్టి చనాకా -కొరాటా బ్యా రేజీ, పంప్ హౌస్‌లు, మెయిన్ కెనాల్, సబ్ స్టేషన్లతో సహా పనులు పూర్తి చేయించారని, 2023 సెప్టెంబర్‌లోనే సక్సెస్‌ఫుల్‌గా వెట్ రన్ కూడా పూర్తి చేశారని తెలిపారు.1.5 టిఎంసిల సామర్థ్యంతో కెసిఆర్ రూ. 500 కోట్లతో సదర్మాట్ బ్యారేజీని సిద్ధం చేస్తే.. రెండేళ్లుగా చుక్క నీరు నిలపకుండా ఉమ్మడి ఆదిలాబాద్ రైతుల నోట్లో మట్టి కొట్టారని, రెండేళ్ల క్రిందనే 18 వేల ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా, ఇవ్వకుండా రైతులకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇ ప్పుడు సిగ్గులేకుండా రిబ్బన్ కట్ చేస్తూ అంతా వారి ఘనతే అని డబ్బా కొట్టుకోవడం వారి దగుల్భాజీతనానికి పరాకాష్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడుతామని చెప్పి రెండేళ్లు గడిచినా ఒక్క తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేక పోయారని నిలదీశారు. మాయ మాటలు చెప్పి అదిలాబాద్ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. గ్రావిటి కాలువను వదిలి ఎత్తిపోతలకు వెళ్లామని తమను విమర్శించిన వా రు ఇప్పుడు తమ్మడిహట్టి నుంచి గ్రా విటి ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చి చూపాలని అన్నారు. లేదంటే అధికారం కోసం ప్రజలకు నోటికొచ్చిన అబద్దం చెప్పినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పాలన మీద రేవంత్‌రెడ్డికి నమ్మకం ఉంటే తమ పార్టీ నేత జోగు రామన్నను, ఇతర బిఆర్‌ఎస్ నా యకులను, కార్యకర్తలను ఎందుకు ఉ దయం నుంచి అరెస్టులు చేశారని ప్ర శ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఇలా ఎన్ని రో జులు గడుపుతారని సిఎ్ండని నిలదీశారు.