
వినూత్న ఆలోచనలకు వేదిక తెలంగాణ
పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
మనతెలంగాణ/హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించి సందడి చేశారు. ఆకాశ మార్గంలో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు ఆయన విహరించారు. హైదరాబాద్ గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైన హాట్ ఎయిర్ బలూన్ అప్పొజిగూడ శివారులో దిగింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని మంత్రి అభివర్ణించారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదిక అని చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఒకవైపు ’ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్’ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యాన్ని చాటుతుండగా, మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్ల ద్వారా ఆధునిక సాంకేతికతను, భవిష్యత్ దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని ఆయన తెలిపారు.
వినూత్న కార్యక్రమాలు
డెస్టినేషన్ తెలంగాణ – ప్రపంచ పర్యాటక కేంద్రంగా తెలంగాణలోని సహజ సౌందర్యాన్ని, చారిత్రక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ‘డెస్టినేషన్ తెలంగాణ‘ అనే బ్రాండ్‌ను బలోపేతం చేస్తూ, కేవలం దేశీయ పర్యాటకులనే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించేలా ఇటువంటి సాహసోపేత క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటకులు కేవలం సందర్శించడమే కాకుండా, ఒక గొప్ప అనుభూతిని పొందేలా వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ క్రాంతి వల్లూరి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.