
న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా ఉంది. మొదటి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో వన్డేలో కివీస్ 7 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. దీంతో సిరీస్ విజేతను డిసైడ్ చేసే చివరి వన్డే ఆదివారం ఇండోర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత జట్టుకు కీలక సూచన చేశాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో బెంచ్‌కి పరిమితమైన బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మూడో వన్డేలో జట్టులోకి తీసుకోవాలని అశ్విన్ సూచించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలకు ప్రాక్టీస్ అవసరమని అన్నాడు.
‘‘బౌలర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ప్రసిద్ధ్, హర్షిత్‌లకు ప్రాక్టీస్ అవసరం. దక్షిణాఫ్రికాతో మ్యాచుల్లో అయితే హిట్ ది డెక్ బౌలర్ అవసరం. అయితే న్యూజిలాండ్‌తో ఆ ఫార్ములా పని చేయదు. అందుకే అర్షదీప్ సింగ్‌ని జట్టులోకి తీసుకోవాలి. అతడు ఇప్పటికే ఎంతో చేశాడు. కానీ, జట్టులో చోటు కోసం ఇంకా పోరాడుతున్నాడు. ఇలా ప్రతిసారి బౌలర్ల విషయంలోనే జరుగుతోంది. బ్యాటర్ల విషయంలో కాదు’’ అని అశ్విన్ అన్నాడు. అర్ష్‌దీప్ చేతికి బంతి ఇచ్చిన ప్రతిసారి చక్కటి ప్రదర్శన చేశాడని.. అందుకే అతడిని మద్ధతు ఇస్తున్నట్లు అశ్విన్ అన్నాడు. ప్లెయింగ్ ఎలెవన్‌లో ఆడే అర్హత అతడికి ఉందని తెలిపాడు. మొదటి రెండు వన్డేల్లో అతడిని తప్పించడం వల్ల అతడి ఆత్మ విశ్వాసం దెబ్బ తినదా? అని అశ్విన్ ప్రశ్నించాడు.