
కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా, లేదా అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ: రామ్ (రవితేజ) వైన్ కంపెనీ యజమాని. తన భార్య బాలమణి (డింపుల్ హయాతి)తో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఇలాంటి రామ్ తన కంపెనీ పని మీద స్పెయిన్ వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రామ్ కి మానస శెట్టి (ఆషికా రంగనాథ్) పరిచయం అవుతుంది. అయితే రామ్… మానస దగ్గర సత్యగా పరిచయం అవుతాడు. ఇద్దరూ ఒక్కటి అవుతారు. అనుకోకుండా జరిగిన ఈ తప్పు రామ్ అలియాస్ సత్య లైఫ్ ను ఎలా మార్చింది ? రామ్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ? ఇంతకీ మానస విషయం బాలామణికి తెలిసిందా? లేదా? చివరకు రామ్ పరిస్థితి ఏమైంది? అనేది మిగిలిన కథ.
కథనం, విశ్లేషణ: భర్త, భార్య, ప్రేయసి మధ్య కథ అల్లుకుని.. ట్రెండీ కామెడీతో వినోదాన్ని పంచడానికి ప్రయత్నించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. అయితే కొన్ని ఎపిసోడ్లు, కామెడీ వరకు మెప్పించినప్పటికీ.. ఒక స్థాయికి మించి ఎంటర్‌టైన్ చేయలేని బలహీన కథ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ని యావరేజ్ సినిమాగా నిలబెట్టింది. ఇందులో కిషోర్ తిరుమల రైటింగ్, టేకింగ్ కొన్ని సన్నివేశాల్లో అతిగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. ఒక దశ దాటాక కామెడీ వర్కవుట్ కాలేదు. హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్ కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలో రవితేజను చూడడం ఈ సినిమాలో రిఫ్రెషింగ్ గా అనిపించే విషయం. మొత్తానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.