
శబరిమల : కేరళలోని శబరిమల పర్వత శ్రేణులలో స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణం జయజయ నాదాల నడుమ బుధవారం రాత్రి అత్యద్భుత రీతిలో మకర జ్యోతి తళుక్కుమంది . అయ్యప్ప భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన ఈ జ్యోతి ఆలయానికి ఈశాన్యం వైపు ఉండే పర్వత శ్రేణువుల శిఖరాల మధ్య మూడుసార్లు కన్పించింది. రాత్రి అవుతున్న వెళ 6.30 6. 45 మధ్య మూడుసార్లు జ్యోతి కన్పించింది. ఈ విషయాన్ని భక్తులు , ఆలయ నిర్వాహకులు సచిత్రాలతో నిర్థారించారు. మకర సంక్రాంతి వేళ మకర జ్యోతి సందర్శన ఘట్టానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జ్యోతి దర్శనంతో రెండు నెలల అయ్యప్ప దీక్ష, అయ్యప్ప యాత్ర ఘట్టం ముగిసింది.అక్కడి పొన్నాంబలమేడు కాంతమాల కొండలపై నుంచి దేవతలు , రుషులు అయ్యప్పకు హారతి ఇస్తారని, ఈ అత్యంత కీలక హారతి ప్రజ్వలనమే ఇక్కడ మకరజ్యోతిగా దర్శనం ఇస్తుందని అయ్యప్ప భక్తులు విశ్వసిస్తారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన దీక్షాధరులైన నల్లటి దుస్తుల అయ్యప్పస్వాములు, వారి శిరస్సున సాంప్రదాయక ఇరుముడితో గంటల తరబడి అడవుల దారుల మీదుగా పర్వత ప్రాంతాల్లో అయ్యప్ప ఆలయ ప్రాంగణానికి చేరారు.ఈరోజే అయ్యప్ప దర్శనం అత్యంత కీలకం అని జనం భావిస్తారు. సాయంత్రం వేళ ఇక్కడికి తరాల ఆచార వ్యవహారాల మేరకు పవిత్ర ఆభరణాలు తిరువభరణంను ఆలయానికి 85 కిలోమీటర్ల దూరంలోని
పందాళం రాజభవనం నుంచి రెండు రోజుల క్రమపద్ధతి ఊరేగిపుతో తీసుకువచ్చారు. ఈ తంతును భక్తులు ఆద్యంతం భక్తి శ్రద్ధలతో గమనించారు. రాజవంశస్తుల నుంచి పవిత్ర వజ్రాలు పొదిగిన ఆభరణాన్ని కేరళ దేవాదాయ మంత్రి విఎన్ వాసవన్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ( టిడిబి) అధ్యక్షులు కె విజయ్‌కుమార్ ఇతర అధికారులు స్వీకరించారు. తరువాత వాటిని ఆలయ ప్రదాన పూజారి (తంత్రి), ఆస్థాన పూజారి స్వీకరించి అయ్యప్ప స్వామికి అలంకరించారు. తరువాత మూలపు మూర్తికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం తరువాత తిరిగి అలంకృత అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఈ దశలో మెట్లదారిపై భారీ తొక్కిసలాట జరిగింది. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదు. ఆలయానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలోని పర్వతాలపై జ్యోతి దర్శనం అయ్యప్ప భక్తుల యాత్రలో కీలకం అయింది. భూ ఖగోళ మహత్తుగా మకర జ్యోతిని భక్తులు భావిస్తారు. ఇంతకు ముందటి ఘటనలు విమర్శల నేపధ్యంలో ఈసారి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం, టిడిబి అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు చేశారు. జన సమూహాన్ని ఎప్పటికప్పుడు అదుపులో పెడుతూ ముందుకు సాగేలా చేశారు. ఆలయ ఆవరణ, దారి పొడువునా వేలాది మంది భక్తుల భద్రతకు తగు చర్యలు తీసుకున్నారు. ఏర్పాట్లు కూడా చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి కూడా అత్యధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు తరలివచ్చారు.