Reading Time: < 1 minute

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. డబ్ల్యూపిఎల్ చరిత్రలో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి భారత క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదురుకున్న హర్మన్ 7 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో (18వ ఓవర్‌) బౌండరీ బాది వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకుంది.

ప్రస్తుతం హర్మన్ ఖాతాలో 1,018 పరుగులు ఉన్నాయి. హర్మన్ కంటే ముందు ఇంగ్లండ్ క్రీడాకారిణి నటాలీ స్కివర్ బ్రంట్ (1,101 పరుగులు) ఈ ఘనతను సాధించింది. ఇక వెయ్యి పరుగుల రేసులో ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్‌లానింగ్ 4 పరుగుల దూరంలో ఉంది. బుధవారం యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్‌ లానింగ్ ఈ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో ఎలీసా పెర్రీ (972), షెఫాలి వర్మ (887) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు గుజరాత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లబించింది.