
కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. గత కొంతకాలంగా సరైన విజయం లేక బాగా ఇబ్బంది పడుతున్న మాస్ రాజా రవితేజ ఈసారి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అయినా రవితేజకు విజయాన్ని అందించిందా? లేదా అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ: రామ్ (రవితేజ) వైన్ కంపెనీ యజమాని. తన భార్య బాలమణి (డింపుల్ హయాతి)తో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఇలాంటి రామ్ తన కంపెనీ పని మీద స్పెయిన్ వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రామ్ కి మానస శెట్టి (ఆషికా రంగనాథ్) పరిచయం అవుతుంది. అయితే రామ్… మానస దగ్గర సత్యగా పరిచయం అవుతాడు. ఇద్దరూ ఒక్కటి అవుతారు. అనుకోకుండా జరిగిన ఈ తప్పు రామ్ అలియాస్ సత్య లైఫ్ ను ఎలా మార్చింది ? రామ్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ? ఇంతకీ మానస విషయం బాలామణికి తెలిసిందా? లేదా? చివరకు రామ్ పరిస్థితి ఏమైంది? అనేది మిగిలిన కథ.
కథనం, విశ్లేషణ: భార్యను అమితంగా ప్రేమించే భర్త అనుకోకుండా మరో అమ్మాయి ప్రేమలో పడితే? భార్య, ప్రేయసి ప్రేమలో ఇరుక్కుపోతే ? ఇలాంటి కథలు చాలానే చూశారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా భర్త, భార్య, ప్రేయసి మధ్య కథ అల్లుకుని.. ట్రెండీ కామెడీతో వినోదాన్ని పంచడానికి ప్రయత్నించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. అయితే కొన్ని ఎపిసోడ్లు, కామెడీ వరకు మెప్పించినప్పటికీ.. ఒక స్థాయికి మించి ఎంటర్‌టైన్ చేయలేని బలహీన కథ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ని యావరేజ్ సినిమాగా నిలబెట్టింది.ఎక్కువ హడావుడి చేయకుండా సింపుల్ గా కథలను నడిపించడం.. భావోద్వేగాలను పండించడం కిషోర్ తిరుమల శైలి. కానీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో అతను రూటు మార్చాడు. ఇందులో తన రైటింగ్.. టేకింగ్ కొన్ని సన్నివేశాల్లో అతిగా అనిపిస్తాయి.
భార్య, ప్రేయసి మధ్య ఇరుక్కుపోయి మేనేజ్ చేయలేక సతమతమయ్యే పాత్రలో రవితేజ.. అతణ్ని కాపాడడానికి ప్రయత్నించే మిత్రులుగా వెన్నెల కిషోర్.. సునీల్ ఒక దశ వరకు నవ్వించగలిగారు కానీ.. తర్వాత సన్నివేశాలు రొటీన్ గా, అతిగా తయారవడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. ఒక దశ దాటాక కామెడీ వర్కవుట్ కాలేదు. అంతేకాకుండా హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్ కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో రవితేజను చూడడం ఈ సినిమాలోఅత్యంత రిఫ్రెషింగ్ గా అనిపించే విషయం. కానీ వినోదం ఓ మోస్తరు స్థాయిని మాత్రం మించలేకపోయింది. హీరో రవితేజ తన పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. హీరోయిన్లు ఇద్దరిలో ఆషికా రంగనాథ్ హైలైట్ అయింది. తన గ్లామర్ డోస్ కాస్త ఎక్కువైంది. డింపుల్ హయతి నటన పర్వాలేదనిపించింది. రెండు పాటల్లో ఆమె కూడా గ్లామర్ విందు చేసింది. సత్య, సునీల్, వెన్నెల కిషోర్ ఓ మోస్తారుగా నవ్వించారు. మొత్తానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.