Reading Time: < 1 minute

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆంక్షల పర్వం కారణంగా యుఎస్ 2025లో లక్ష వీసాలను రద్దుచేసింది. వాటిలో విద్యార్థుల వీసాలే 8 వేలు ఉన్నాయి. విద్యార్థులలో నేర కార్యకలాపాలను ఉటంకిస్తూ, వలసలను అరికట్టేందుకు విసృ్తత ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. అమెరికా భద్రత, సురక్షితం కోసం ఈ దుండగులను బహిష్కరిస్తూనే ఉంటామని విదేశాంగ శాఖ సోమవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ లో తెలిపింది.కేవలం ఒక సంవత్సరం లో, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లక్ష వీసాలను రద్దుచేసిందని స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ టామీ పిగోట్ పేర్కొన్నారు. అమెరికా రద్దు చేసిన వీసాలలో దొంగతనం, దాడులలో పాల్గొన్నవారు, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు, దోషులుగా తేలిన విదేశీయులు ఉన్నారని పేర్కొన్నారు. మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చివరి సంవత్సరం 2024 లో 40 వేల వీసాలు రద్దయితే, ట్రంప్ పాలనలో 2025లో అంతకు రెట్టింపు కంటే ఎక్కువగా , లక్ష వీసాలు రద్దయ్యాయి.

2025లో వీసాల గడువు ముగిసిన తర్వాత కూడా వ్యాపారం, పర్యాటకం కోసం వచ్చి దేశంలో ఉన్నవారి కోసం ఒక పక్క గాలిస్తున్నారు. అలాగే నేరాలు, చట్టవ్యతిరేక ప్రదర్శనలలో పాల్గొన్న 8 వేల మంది విద్యార్థుల వీసాలు, స్పెషల్ వీసాలపై ఉన్న 25 వేల మంది పత్రాలను రద్దు చేసినట్లు స్టేట్ డిపార్ట్ మెంట్ వెల్లడించినట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. రద్దయిన వాటిలో డ్రగ్స్ వాడకం, సరఫరా నేరాలకు పాల్పడిన విద్యార్థుల వీసాలే 500 వరకూ ఉన్నాయి. నిపుణులైన కార్మికులలో తాగి డ్రైవింగ్ చేసిన వారు ప్రమాదాలకు కారణమైన వారు 30 శాతం మంది ఉండగా, దాడుల కేసులతో ప్రమేయం ఉన్నవారు, దొంగతనాలకు పాల్పడిన వారు, పిల్లలు విషయంలో నేరాలకు పాల్పడిన వారు, మోసాలు, కిడ్నాప్ లకు పాల్పడిన వారందరి వీసాలు రద్దయిన వాటిలో ఉన్నాయి. స్టేట్ డిపార్ట్ మెంట్ నిరంతర పర్యవేక్షణ కారణంగా ఈ చర్య సాధ్యమైంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ఫస్ట్ అనే విధానానికి కట్టుబడి ఉంది. ప్రజలకు, జాతీయభద్రతకు భంగం కలిగించే విదేశీయు లెవరైనా ఉపేక్షించరాదని సర్కార్ విధానంగా కన్పిస్తోంది.