Reading Time: < 1 minute

 విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో విదర్బ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో విదర్భ 76 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 50ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఢిల్లీ 45.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు వైభవ్ (28), ప్రియాన్ష్ ఆర్య (28) మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. అయితే నితీశ్ రాణా (0), తేజస్విదహియా (15), మయాంక్ గుసేన్ (18) నిరాశ పరిచారు. వికెట్ కీపర్ అనూజ్ రావత్ (66) ఒంటరి పోరాటం చేశాడు. హర్ష్ త్యాగి (27), హ్రితీక్ సోకెన్ (21) తప్ప మిగతా వారు విఫలం కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.

ప్రత్యర్థి జట్టు బౌలర్లలో నచికేత్ భూతె నాలుగు, కెప్టెన్ హర్ష్ దూబె మూడు, ప్రఫుల్ హింగే రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భకు ఓపెనర్ అతర్వ్ టైడ్, వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్ షోరే అండగా నిలిచారు. ఇద్దరు ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. షోరే 7 ఫోర్లతో 49, అతర్వ టైడ్ 8 ఫోర్లతో 62 పరుగులు చేశారు. రవికుమార్ సమర్థ్ (23) పరుగులు సాధించాడు. ఇక యశ్ రాథోడ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన యశ్ 73 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. దీంతో విదర్భ మెరుగైన స్కోరును సాధించింది.