Reading Time: < 1 minute

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్‌లో వరుసగా తొలి మూడు మ్యాచుల్లో విజయం సాధించి.. 3-0 తేడాతో భారత్ సిరీస్‌ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసిసి టి-20 ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఎవరికి అందుబాటులో లేని విధంగా 929 పాయింట్లతో నెం.1 ర్యాంకులో స్థిరపడ్డాడు. ఇక కివీస్ టి-20 సిరీస్‌లో రాణిస్తున్న టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. 717 పాయింట్లతో ఐదు స్థానాలు మెరుగుపరచుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. ఇక గాయం కారణంగా న్యూజిలాండ్ సిరీస్‌కి దూరమైన తిలక్ వర్మ మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు.

బౌలర్ల విషయానికొస్తే.. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలి స్థానంలో ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా 4 స్థానాలు మెరుగుపర్చుకొని 13కు, రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19కి, హార్థిక్ పాండ్యా 18 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంకుకు చేరారు. వరుణ్ మినహా టాప్-10లో భారత బౌలర్లు ఎవరూ లేరు. ఆల్ రౌండర్లలో టీం ఇండియా ఆటగాళ్లు హార్థిక్ పాండ్యా ఒకటి, శివమ్ దూబే 6 స్థానాలు మెరుగుపరచుకొని 3, 12 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. టాప్‌-1లో జింబాబ్వే ఆటగాడు సికందర్ రాజా, టాప్-2లో పాకిస్థాన్ ఆటగాడు సైమ్ అయుబ్ ఉన్నారు.