
న్యూఢిల్లీ: వికసిత్ భారత్‌లో రైతులు, మహిళలు, యువత కీలకపాత్ర పోషించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని, తయారీ రంగంలో మంచి ప్రగతి నమోదవుతోందని ప్రశంసించారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రసంగించారు. స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లోనూ భారత్ దూసుకెళ్తోందని, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, సామాజిక న్యాయసాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని, సికిల్ సెల్ వంటి వ్యాధులపై పోరాటం కొనసాగిస్తున్నామని, కరోనా తరువాత బీమాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని ద్రౌపది ముర్మూ తెలియజేశారు.
పేదల కోసం నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని, వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు విస్తరించామని, జలజీవన్ మిషన్ ద్వారా కోట్ల మందికి తాగునీరు అందిస్తున్నామని, భారత దేశంలో స్పేస్ టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్ జీ చట్టం తీసుకొచ్చామని, ఆపరేషన్ సిందూర్ మన సైన్యం సత్తా చాటిందన్నారు. భారత్‌పై దాడి చేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత భారత డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిందని, నానో చిప్‌ల తయారీపైనా భారత్ దృష్టి సారించిందని, మైక్రో చిప్‌ల తయారీలో స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించాగలిగామని, ముద్ర యోజన ద్వారా చిరువ్యాపారులకు భారీగా రుణాలు ఇచ్చామని, పిఎం విశ్వకర్మ యోజన ద్వారా 20 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచిందని, కొత్తగా 25 లక్షల సంస్థలు స్టార్ట్‌ప్‌లుగా నమోదయ్యయని రాష్ట్రపతి వివరించారు.