
టీం ఇండియాలో టి-20 స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అభిషేక్ శర్మ. ప్రత్యర్థి ఎవరైనా సరే దంచికొడుతున్నాడు ఈ యువ క్రికెటర్. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి-20లో 340 స్ట్రైక్ రేటుతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో అభిషేక్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా అభిషేక్ ఆటతీరును కొనియాడాడు. అభిషేక్‌కు విండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్‌తో పోల్చాడు. అభిషేక్.. గేల్ కంటే విధ్వంసకర ఆటగాడని కైఫ్ అన్నాడు.
‘‘సాధారణంగా దూకుడుగా ఆడే ఆటగాళ్లలో నిలకడ ఉండదు. నేను చాలా మంది పెద్ద ఆటగాళ్లను గమనించాను. క్రిస్ గేల్ పెద్ద పెద్ద షాట్లు కొడతాడు. కానీ, అతడు క్రికెట్ చాలా తెలివిగా ఆడుతాడు. మెయిడిన్ ఓవర్లు కూడా ఆడుతాడు. మొదటి ఓవర్లో జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ.. ఆ తర్వాత వేగం పెంచుతాడు. ముఖ్యంగా బెంగళూరు వంటి పిచ్‌ల మీద నిలకడగా బ్యాటింగ్ ప్రారంభిస్తాడు’’ అని కైఫ్ అన్నాడు.
అయితే అభిషేక్ అందుకు విరుద్ధమని కైఫ్ అన్నాడు. ‘‘అభిషేక్ క్రీజ్‌లో సెటిల్ కావడానికి ఎక్కువ టైం తీసుకోడు. వచ్చీ రాగానే బౌలర్ల మీద ఎదురుదాడి చేస్తాడు. అలా విధ్వంసం సృష్టించే ఆటగాళ్లలో నిలకడ ఉండదు. కానీ, అభిషేక్ అందుకు భిన్నం. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ తనను తానుని నిరూపించుకుంటున్నాడు. కేవలం 12, 14 బంతుల్లోనే 60 నుంచి 70 పరుగుల వరకూ రాబడుతున్నాడు. అదే అతడిని మ్యాచ్ విన్నర్‌గా నిలబెడుతోంది. అభిషేక్ ఒకవేళ రాణిస్తే.. టీం ఇండియానే కచ్చితంగా విజేతగా నిలుస్తోంది’’ అని కైఫ్ విశ్లేషించాడు.