Reading Time: 4 minutes

ఈ మధ్యనే స్విట్జర్లాండ్ దావోస్‌లో 55 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు, ప్రతినిధులు, అధికారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే 24 దేశాలకు చెందిన 400 మంది ప్రముఖ కుబేరులు (సూపర్ రిచ్) ‘గెలవాల్సిన సమయం మన భవిష్యత్తును తిరిగి పొందాలి. దావోస్‌లోని నాయకులారా- అత్యంత సంపన్నులపై అధిక పన్నులు విధించండి’ (టైం టు విన్- వి మస్ట్ విన్ అవర్ ఫ్యూచర్ – లీడర్స్ ఎట్ దావోస్- టాక్స్ ద సూపర్ రిచ్) అనే శీర్షికతో ప్రపంచ ఆర్థిక వేదికపై ఉన్న నాయకులకు లేఖ రాశారు. ఈ లేఖపై అబి గేల్ డిస్నీ (వాల్ట్ డిస్నీ మనవరాలు), హాలీవుడ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో నటించిన మార్క్ రఫాలో (బ్రూస్ బ్యానర్/హల్క్ పాత్రధారి) వంటి మహామహులు సంతకాలు చేశారు. వీరిని మానవతావాద కోటీశ్వరులు/ దేశభక్తి కలిగిన కోటీశ్వరులు (పేట్రియాటిక్ మిలియనీర్స్) అంటారు.

అమెరికాలో సైతం దేశభక్తి కలిగిన అత్యంత కోటీశ్వరులు వీరిలాగే తమపై అధిక పన్నులు వేయాలని గత కొంతకాలంగా కోరుకుంటున్నారు. నిజానికి మాతృదేశంలో వివిధ రకాల వనరులు ఉపయోగించుకొని సంపద పోగేసిన తరువాత పన్నుల రూపంలో గాని, ప్రభుత్వ పరంగా గాని కాస్తంత ఇబ్బంది కలిగిన పరాయి దేశాలకు పారిపోతున్నారు. భారతదేశం లో గత పది సంవత్సరాల (2014- 2024) నుండి ఇంచుమించు 23,000 మందికి పైగా సుసంపన్నలు (హై నెట్ వర్త్ ఇండివిడియల్స్) పన్ను సడలింపుల కోసం, పెట్టుబడి అవకాశాల కోసం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం సంపదతో సహా ఇతర అనుకూల దేశాలకు వెళ్లిపోయారు. 3500 మంది సుసంపన్నులు ఒక్క 2025 సంవత్సరంలో మన దేశాన్ని వదిలి వెళ్లారు. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), సింగపూర్, మాల్డా, స్పెయిన్, పోర్చుగల్, అమెరికా, ఇటలీ, సైప్రస్ లాంటి దేశాలకు వెళ్తున్నారు. 2019- 2024 వరకు సుమారు 10 లక్షలకు పైగా ప్రజలు మన దేశ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలలో స్థిరపడ్డారు. ఉదాహరణకు సుసంపన్న వినోద్ అదానీ సైప్రస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు.

సుసంపన్నుల వలసల పరంగా భారతదేశం అగ్రస్థానంలో ఉన్న దేశాల సరసన ఉన్నట్లు ‘హెన్లి ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్’ నివేదిక తెలియజేస్తున్నది. అమెరికాలో సైతం కొందరు సుసంపన్నులు తమపై అధిక టాక్స్ విధించాలని కోరుతున్నారు, ఆ అమెరికా సుసంపన్నుల స్ఫూర్తితో యునైటెడ్ కింగ్డమ్, కెనడా సుసంపన్నులు కూడా ‘పేట్రియాటిక్ మిలియనీర్స్’ పేరిట సంస్థను ఏర్పాటు చేసుకొని నిధులు సేకరించి ఇదే తరహలో పనిచేసే ‘మిలియన్ ఇయర్స్ ఫర్ హ్యుమానిటీ’, పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే ‘ఆక్స్‌ఫామ్‘ అనే సంస్థతో కలిసి తమ వంతు సహాయం చేస్తున్నారు. దావోస్ సుసంపన్నుల లేఖ సారాంశం ఏంటంటే ‘సాంకేతికంగా ప్రపంచ ప్రజలమైన మనమెంత అభివృద్ధి చెంది అనుసంధానమై ఉన్నప్పటికీ ఆర్థిక అసమానతల కారణంగా గతంలో ఎన్నడు లేనంతగా విడిపోయి ఉన్నాం’, ప్రపంచవ్యాప్తంగా కేవలం 1% సంపన్న వర్గాల చేతుల్లో ఉన్న సంపద, 95% ప్రజల చేతిలో ఉండాల్సిన సంపదకంటే ఎక్కువ ఉన్నది.

సుసంపన్న కుబేరులకు పేదలకు మధ్య ఆర్థిక అంతరాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి, అభివృద్ధితోపాటు పర్యావరణ విధ్వంసం కూడా శరవేగంగా జరుగుతున్నది, పత్రికా స్వేచ్ఛను హరించి, ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేసే/ నిలబెట్టే/ కూల్చే స్థాయిలో గుప్పెడు మంది అపర కుబేరులు ఉన్నారు. ప్రజాస్వామ్యాలు ప్రమాదపుటంచుల్లో ఉన్నాయని ఇలాంటి విపరీత ధోరణులకు మాలాంటి సుసంపన్నులే కారణమని తెలిపారు. మంచి భవిష్యత్తు, మంచి సమాజాలు, మంచి ప్రజాస్వామ్యాలు, మంచి పర్యావరణం తిరిగి రావాలంటే 2026లో మేము సూచిస్తున్న పరిష్కారం ఒక్కటే అత్యంత సంపన్నులపై అత్యధిక పన్నులు వేయడం అన్నారు.

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారిని పేదలుగా నిర్ధారించింది. ఐక్యరాజ్యసమితి 2024 నివేదిక ప్రకారం 700 కోట్ల ప్రపంచ జనాభాకు గాను సుమారు 110 కోట్ల మంది తీవ్రమైన బహుముఖ పేదరికంలో ఉన్నారు. ఇందులో రేపటి ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించగలిగే యువత 50% పైగా 18 సంవత్సరాల లోపు వారు ఉన్నారు. ప్రపంచ పేదలలో 83% మంది ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి దక్షిణ ప్రాంతం, దక్షిణాసియా దేశాలలో ఉన్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో పేదలు ఎక్కువ ఉన్నారు. పేదల పరంగా చూసినప్పుడు సుమారు 23.4 కోట్లమంది పేదలతో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నది. 1991లో ప్రముఖ అమెరికా పత్రిక కథనం ప్రకారం దేశంలో కేవలం ఒకే ఒక్క బిలియనీర్ ఉండేవాడు. 1991 తరువాత నాటి ప్రధాని పివి నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల కావచ్చు లేదా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్‌పిజి) వల్ల కావచ్చు నేడు బిలియనీర్ల సంఖ్య 162కు చేరింది. అదే సమయంలో ధనికులు పేదల మద్య నింగి నేలకున్నంత వ్యత్యాసం ఏర్పడ్డది.

ఆర్థిక సంస్కరణలు దేశాభివృద్ధి పరంగా సత్ఫలితాలను ఇవ్వవచ్చు. కానీ పేదలను బాగుపరచడంలో మాత్రం ఉపయోగపడినట్లు కనబడడం లేదు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు, బడాబాబులు బాగుపడి దేశ ఆదాయం పెరగడం వల్ల ఆర్థికంగా భారత్ ముందుకి వెళ్తున్నట్లు కనిపించినప్పటికీ పేదవారు మరింత వెనక్కి వెళుతున్నట్టు తెలుస్తుంది. సంస్కరణల ప్రయోజనాలు అందరికీ అందక కొందరికి అందడంవల్ల సంస్కరణల ఫలితాలు పొందిన వాళ్లు పన్ను విధానంలో ఉన్న లోపాలను ఆసరా చేసుకుని పన్ను ఎగ్గొట్టడం వల్ల దేశసంపదకు నష్టం వాటిల్లుతున్నది. ఫలితంగా సామాన్య ప్రజానీకానికి ప్రయోజనం చేకూర్చే సంక్షేమ పథకాలపై ప్రభావం పడడం వలన ప్రభుత్వ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరుకోలేకపోతున్నాయి. కొన్ని సార్లు పాలక, అధికార వర్గాలు సంపన్నులకు లబ్ధి చేకూర్చే విధానాలు అలంబించడం, సహజ వనరులను దోచిపెట్టడం, పర్యావరణ ప్రభావాలను లెక్కచేయకుండా వనరులు తోడుకోవడానికి అనుమతులు ఇవ్వడం లాంటి విధానాలతో సామాన్య ప్రజానీకానికే భరించలేని సమస్యలు వస్తున్నాయి. సామాన్య ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను అందించినట్లయితే చాలావరకు అసమానతలు తగ్గడానికి అవకాశం ఉంది. పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు సరైన ప్రభుత్వ వైద్యం అందక ప్రైవేటు వైద్యానికి వెళ్లి లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు. ఫలితంగా ఆదాయం లేని పేదలు అప్పుల పాలవుతున్నారు.

ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో నాణ్యమైన విద్యను అందిస్తే పేదలు వారి పిల్లలను అప్పులు చేసి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు పంపేవాళ్లు కారు. కానీ నేటి పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య అందకపోతే మన పిల్లలు వెనుకబడిపోతారని భావనతో అప్పులు చేసి మరీ ప్రైవేటు విద్యను ఆశ్రయించి తిప్పలు పడుతున్నారు. చివరికి అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. నిజానికి మన దేశం వ్యవసాయాధారిత దేశం కానీ ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, వ్యవసాయానికి చేసిన అప్పులు తీరక ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి, రైతులను ఆదుకొని, పంట రుణాలు ఇచ్చి, గిట్టుబాటు ధరలు కల్పిస్తే రైతే రాజు. ఆర్థిక వ్యవస్థలలో నిగూఢంగా ఉన్న లోపాలను సవరించి ఆర్థిక ప్రయోజనాలు అందరికీ అందేటట్లు చేసి సమసమాజ భారతాన్ని నిర్మించాలి. లేనియెడల అసమానతలు పెరిగిపోతాయి.

కొన్ని నివేదికలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం 2028 నాటికి భారత్‌లో 4,03,000 మంది సంపన్నులు అవుతారట. ఫలితంగా దేశ ప్రతిష్ట పెరుగుతుంది. కానీ పేదవారు సైతం బాగుపడితేనే దేశప్రతిష్ట మసకబారదు. మనకంటే చిన్నదేశాలు సైతం ప్రజలలో అసమానతలు లేకుండా ఉన్నాయి. కారణం దేశ సంపద అందరికీ చేరే విధంగా ఉన్న ఆర్థిక సంస్కరణలు, పాలకుల నిబద్ధత, అక్కడున్న మెరుగైన ఉపాధి అవకాశాలు, విద్య, వైద్య సదుపాయాలు, ప్రజల చైతన్యం. మన దేశప్రజలు కూడా ప్రలోభాలకు లోను కాకుండా బాధ్యతాయుత ప్రభుత్వాలను ఎన్నుకొని, సరియైన పాలన ద్వారా దేశ భవిష్యత్తును నిర్మించుకొని తరువాత తరాలవారికి ఆదర్శవంతంగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ఆర్థికంగా ఎదిగిన పారిశ్రామికవేత్తలు, బడాబాబులు ఈ దేశంలో చదువుకొని, ఈ దేశవనరులు ఉపయోగించుకొని, ఈ నేల గాలి పీల్చి పరాయి దేశానికి పోయి పరాయి వారిని బాగుపరిచే కంటే స్వదేశంలోని తోటి వారికి తోడ్పాటు అందించి దేశాభివృద్ధికి పాటుపడి మాతృభూమి రుణం తీర్చుకుంటే అంతకంటే కావలసింది ఇంకేముంటుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికకు వచ్చిన సంపన్నులు ఆలోచించినట్లుగా మన దేశ సంపన్నులు కూడా ఆలోచించాలని కోరుకుంటూ.

కావలి చెన్నయ్య

90004 81768