Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ డు మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి.అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించారు. అనంతరం సిఎస్ రామకృష్ణారావు, డిజిపి శివధర్‌రెడ్డి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశమయ్యారు. మధ్యాహ్నం అడిషనల్ డిజిపి మహేష్ భగవత్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి, ఇతర అధికారులతో కలిసి ఎస్‌ఇసి రాణికుముదిని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఈ సందర్భంగా ఎస్‌ఇసి రాణి కుముదిని మాట్లాడుతూ, మున్సిపల్,

కార్పొరేషన్ ఎన్నికల కోసం బుధవారం(జనవరి 28) నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని అన్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. వచ్చే నెల 16వ తేదీన కార్పొరేషన్‌లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయని తెలిపారు. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు, ఏడు కార్పోరేషన్లలోని 414 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో 52.43 లక్షల మంది తమ ఓటర్లు ఉండగా, వారిలో 25.62 లక్షల మంది పురుషులు, 26.80 మంది మహిళలు, 640 మంది ఇతరులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు.

ఓటర్లందరూ స్వఛ్చందంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో 130 మున్సిపాలిటీలు ఉంటే ప్రస్తుతం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంట్రోల్ రూం నుంచి ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షణ చేయనున్నట్లు పేర్కొన్నారు. రూ.50 వేలకు మించి నగదుకు లెక్క చూపవలసి ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయని వెల్లడించారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అడిషనల్ డిజిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల దృష్టా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు చెప్పారు. ఈ సమయంలో రూ.50 వేల నగదుకు మాత్రమే అనుమతి ఉంటుందని, అంత కంటే ఎక్కువ నగదు ఉంటే అవసరమైన పత్రాలు ఉండాలని అన్నారు. మేడారం జాతరకు వెళ్లేవారికి చెకింగ్ మినహాయింపు ఉంటుందని, అయితే నగదు పరిమితికి మించి ఉండొద్దని అన్నారు. ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు వెబ్ కాస్టింగ్ ఉంటుందని చెప్పారు. 22 వేల మంది పోలీసులు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారని అన్నారు. 1926 సున్నితమైన, 1302 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించామని తెలిపారు. నిర్మల్,బోధన్, నిజామాబాద్ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బంధీ ఏర్పాట్లు చేయనునన్నట్లు పేర్కొన్నారు.