
ఇసుక వేస్తే రాలనంత జనం, మేడారం ఒక కుగ్రామం. కాని నేడు రెండు నుండి మూడు కోట్ల మంది ప్రజలను ఒక దగ్గరకు రప్పించే జనజాతర. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. సమ్మక్క సారలమ్మ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూజరుల సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది మండమేలిగే పండగ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పూజారులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కి.మీ దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండకోనల మధ్య ఈ చరిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా, కేవలం తెలంగాణలోనేగాక భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క.
‘దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర’గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. 13వ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం జరిపించారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు, మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు ‘పగిడిద్దరాజు’ కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.
సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలుతీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది.
గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపుధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్టదగ్గర పసుపు, కుంకుమలుగల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటినుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణెరూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు.
దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి గద్దెల స్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు, ఏటేటా జనం పెరుగుతుండడంతో జాతరను కొండకింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకు వస్తారు. ఈసారి మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం రూ. 150 కోట్లను కేటాయించింది. కేంద్రం ప్రభుత్వం కూడా 3 కోట్ల 70 లక్షలు విడుదల చేసింది. తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి మేడారంలోనే బసచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రపుటల్లోకి ఎక్కారు. మంత్రులు కూడా సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం, జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి సీతక్క ఇక్కడే ఉండి జాతర విజయవంతం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ పలుమార్లు మేడారం సందర్శించి అభివృద్ధి పనులు వేగిరం చేశారు. న్యూజిలాండ్ దేశం నుండి వచ్చిన ఆదివాసీలు హాకా నృత్యం చేసి అందరినీ ఉత్తేజపరిచారు. గత రెండు నెలల ముందు నుండే వేలాది మంది భక్తులు మేడారం జాతరకి వచ్చి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. పిల్లలకు పుట్టువెంట్రుకలు తీసారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేడారంలో బస్‌స్టాండ్ ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుండి భక్తులు మేడారం వచ్చేలా నాలుగు వేల బస్‌లను నడుపనుంది. వేరే జిల్లాల డిపోల బస్సులు మేడారం కి వస్తున్నాయి. పోలీసు శాఖ కూడా 20 వేలమందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నది. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా సులభంగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారంలో ఇప్పటికే అన్ని స్టాల్స్ వెలిసాయి. అన్ని నిత్యావసర వస్తువులు ధరలు కొండెక్కాయి. వాటర్ బాటిల్స్‌కు రూ. 50 చొప్పున, కొబ్బరికాయ 70 రూపాయల చొప్పున, బెల్లం, కోళ్లు, మేకల, గొర్రెల రేట్లు అమాంతం పెంచారు. పెరిగిన ధరలు తగ్గించేలా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలి. జాతరను విజయవంతం చేసి జాతర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం.
కామిడి సతీష్ రెడ్డి
98484 45134