
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ పని చేసినా అతిగానే ఉంటుంది. లేడికి లేచిందే పరుగన్నట్లు ఆలోచన రావడమే తరువాయి వెనకాముందూ ఆలోచించకుండా దానిని అమలు చేసేందుకు ఆయన చేపట్టే చర్యలతో తల బొప్పి కట్టిన సంఘటనలు ఈ ఏడాది కాలంలో అనేకం. అలాంటి వాటిలో అక్రమ వలసదారులను గుర్తించి, వారిని స్వదేశాలకు తిప్పి పంపించే ప్రక్రియ ఒకటి. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగానే రెండోసారి అధికారంలోకి వచ్చిన వెనుపెంటనే ఆయన అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు. వారి చేతులకు బేడీలు వేసి, సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న చిత్రాలను పత్రికలు ప్రచురించడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు భగ్గుమన్నారు. దీంతో నాలుక కరచుకున్న ట్రంప్ మహాశయుడు స్వచ్ఛందంగా తమ దేశం వీడి వెళ్లిపోయేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. అది అంతగా సత్ఫలితాలనివ్వని కారణంగా, తాజాగా మరిన్ని కఠిన చర్యలకు తెర తీశారు. అక్రమంగా తమ దేశంలో తిష్ఠ వేసుకుని కూర్చున్నవారిని గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించారు. పోలీసుల సహాయంతో ఇల్లిల్లూ తనిఖీ చేసి, అక్రమ వలసదారుల్ని పట్టి బంధించి, స్వదేశాలకు తిప్పి పంపడం ఈ ఏజెంట్ల పని.
తాజాగా మిన్నెపొలిస్ నగరంలో ఇమిగ్రేషన్ సోదాలు జరుపుతుండగా అలెక్స్ ప్రెట్టీ అనే 37 ఏళ్ల వ్యక్తి తుపాకీ చూపి బెదిరించాడనే నెపంతో అతనిపై ఎనిమిదిమంది ఏజెంట్లు దాడి చేసి, నేలకు అదిమిపెట్టి, అతనినుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా కాల్పులు జరిపి అతని ప్రాణాలు తీశారు. గత పది రోజుల్లో ఇది రెండో సంఘటన. విచిత్రమేమిటంటే, పౌరులు లైసెన్సుడు తుపాకీతో బహిరంగంగా తిరిగేందుకు స్థానిక చట్టాలు అనుమతిస్తున్నాయి. పైపెచ్చు హతుడికి ఎలాంటి నేరచరిత్రా లేకపోవడం గమనార్హం. ఉత్తిపుణ్యాన ఒక అమాయకుడి ఉసురు తీసిన పోలీసులపై స్థానికులు మండిపడుతున్నారు. తమ నగరంనుంచి ఇమిగ్రేషన్ ఏజెంట్లు వెనక్కు వెళ్లిపోవాలంటూ వారు ఆందోళనలు ప్రారంభించారు. ట్రంప్ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అమెరికాకు అక్రమ వలసలు ఆగడం లేదన్నది వాస్తవం. ఇప్పటికీ అగ్రరాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించేవారి సంఖ్య లక్షల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది ఇలా అమెరికాకు దొడ్డిదారిన వెళ్లివారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలని యుఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. వీరిలో భారతీయులూ ఉన్నారు. గత ఏడాది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ దాదాపు 24 వేల మంది భారతీయులు అరెస్టయ్యారు.
ఒక అంచనా ప్రకారం ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడు సరిహద్దుల వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అమెరికాకు అక్రమ మార్గాల్లో వలస వస్తున్న వారిలో మెక్సికో, ఎల్ సాల్వడార్ లనుంచి చొరబడేవారి సంఖ్యే ఎక్కువ. అగ్రరాజ్యంలో సగటున ఇంటికొకరు చొప్పున ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా నివాసం ఉంటున్నట్లు అంచనా. అమెరికా దేశ జనాభాలో అక్రమ వలసదారుల సంఖ్య ఐదు శాతమని అధికారిక గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. అరిజోనా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల సంఖ్య మరీ ఎక్కువ. ఏ దేశానికైనా అక్రమ వలసదారులు గుదిబండలా మారతారనడంలో సందేహం లేదు.
భారత్ కూడా బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాలనుంచి ఇలాంటి బెడదను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దేశపౌరుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థకు కూడా చేటు తెచ్చే అక్రమ వలసదారుల్ని గుర్తించి, వెనక్కు పంపివేయడంలో ఎవరికీ అభ్యంతరం ఉండనక్కరలేదు. అయితే, అందుకు అనుసరించే విధానాలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా లేకపోతే ఏ జరుగుతుందో చెప్పేందుకు తాజాగా మిన్నెపొలిస్‌లో జరిగిన సంఘటనే ఉదాహరణ. అక్రమ వలసదారులను వెనక్కు పంపాలంటూ ఎలుగెత్తిన ప్రజానీకమే, ప్రభుత్వం అనుసరిస్తున్న దమననీతిని ఖండిస్తూ ఇప్పుడు ఆందోళనలకు దిగుతోంది.
ట్రంప్ నిర్ణయాలను ఆమోదించేవారి సంఖ్య ఆ దేశంలో క్రమేణా తగ్గుతూ వస్తోంది. అక్రమ వలసదారులపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించేవారి సంఖ్య 53 శాతంగా ఉండటం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో దూకుడుగా ముందుకు వెళ్తున్న ట్రంప్, తన వలసవాద విధానాన్ని మరింత పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా రూపొందించుకోవలసిన సమయమిది. లేనిపక్షంలో ఇంటాబయటా మరింత అభాసుపాలు కాక తప్పదు.