
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం బడ్జెట్ హల్వా వేడుక నిర్వహించగా, ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. రైసినా హిల్‌లోని నార్త్ బ్లాక్‌లో ఈ హల్వా వేడుక నిర్వహించారు. ఈ వేడుక రోజున కేంద్ర బడ్జెట్ 202627 పత్రాల ప్రింటింగ్‌ను ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాలు కార్తవ్య భవన్1కి మారినప్పటికీ, అక్కడ బడ్జెట్ ముద్రణ లేకపోవడంతో సంప్రదాయం ప్రకారం నార్త్ బ్లాక్‌లోనే హల్వా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన అన్ని విభాగాల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి నిర్మలా సీతారామన్ హల్వాను పంచారు. హల్వా వేడుక అనంతరం బడ్జెట్ తయారీలో ఉన్న అధికారులకు లాక్-ఇన్ పీరియడ్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వారు బడ్జెట్ పూర్తయ్యే వరకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాకే వారు బయటకు వస్తారు.
ఈ సందర్భంగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రెస్‌ను పరిశీలించి, బడ్జెట్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. బడ్జెట్ 2026-27ను నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి వృద్ధి రేటు 7.6 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఈ బడ్జెట్ రూపొందుతోంది. గత కొన్ని సంవత్సరాల మాదిరిగానే ఈ బడ్జెట్ కూడా పూర్తిగా పేపర్‌లెస్‌గా ప్రవేశపెట్టనున్నారు.బడ్జెట్‌కు సంబంధించిన అన్ని పత్రాలు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఒఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తుంది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో బడ్జెట్ వివరాలు అందుబాటులో ఉం టాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రజలు, ఎంపీలు యాప్ లేదా వె బ్‌సైట్ ద్వారా పత్రాలను చూడవచ్చు. రైల్వే బడ్జెట్ విలీనంతో పాటు పేపర్‌లెస్ విధానం వంటి మార్పులు చేసినప్పటికీ, హల్వా వేడుక సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇది బడ్జెట్ తయారీలో పనిచేసే సిబ్బందికి ప్రోత్సాహకరంగా నిలుస్తోంది.