
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కుంభకోణా న్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వెల్లడించారు. సింగరేణి బొగ్గు స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీ సుకోవాలని కోరుతూ మంగళవారం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ నేతలు లోక్‌భవన్‌లో గవర్న ర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం లోక్‌భవన్ బయట మాజీ మంత్రి హరీష్‌రావు, బిఆర్‌ఎస్ ముఖ్యనేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. సింగరేణి కుంభకోణంపై, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద దర్యాప్తు చేయాలని కోరుతూ గవర్నర్‌ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చినట్లు చెప్పారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతికి సంబంధించి ఆధారాలతో సహా తమ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని విమర్శించారు. ఈ కుంభకోణాన్ని పూర్తిస్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం మాట్లాడటమే కాదు, ఆధారాలతో సహా మరి పూర్తిస్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశామని తెలిపారు. సింగరేణి కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్‌ను దృష్టి మళ్లించడానికి సిట్ విచారణ పేరిట ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారని మండిపడ్డారు.
సిఎం అంటే కోల్ మాఫియా..
సిఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సిఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందని కెటిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తాము ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదని విమర్శించారు. ఈ విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతూ, విదేశాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.సిఎం ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఏ పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు కొడతా ఉన్నారని విమర్శించారు.ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తదో ఒకసారి సిఎం కూడా ఆలోచించుకోవాలని సూచించారు. పది కోట్ల సింగరేణి నిధులు దుర్వినియోగం చేసి సిఎం ఫుట్ బాల్ ఆటకి వినియోగించుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలతో సిఎం ఎలాగో ఫుట్ బాల్ ఆడుతున్నారని.. కానీ, సింగరేణి సంస్థతో కూడా ఫుట్ బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఆ సంస్థకి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఒక్క స్కామ్‌కి సంబంధించి అన్ని ఆధారాలు బయటపెడితే కూడా ఇప్పటివరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదని విమర్శించారు.
సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఇక్కడే ఎందుకు..?
దేశంలో ఏ బొగ్గు గనిలోలేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఇక్కడే ఎందుకని కెటిఆర్ ప్రశ్నించారు. టెండర్ల విషయంలో గతంలో సైట్ విజిట్ సర్టిఫికేషన్ అంటే సైట్ మీదకి వెళ్లినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి అని పేర్కొన్నారు. పారదర్శకతకు పాతరవేసి ఆ నిబంధన ఎందుకు పెట్టినారని నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం లేదని విమర్శించారు. 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధన కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసి ఉంటే, అప్పుడు ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. టెండర్ చేశారు.. మళ్ళీ ఆ టెండర్ వెంటనే రద్దు చేశారని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల్లో ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు..ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయి..ఎన్ని సర్టిఫికెట్లు సింగరేణి సంస్థ జారీ చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని తాము డిమండ్ చేస్తే ఇప్పటివరకు సమాధానం లేదని అన్నారు. కొంతమందికే ఆ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు.. మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు..? అని అడిగారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో రింగ్ మాస్టర్ సిఎం బావమరిది
సృజన్ రెడ్డినా..కాదా.. స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సోదరులు దోచుకున్నది సరిపోక ఆయన బావమరిదికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ పేరుతో హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల్లోని రూ.5 లక్షల కోట్ల విలువైన 9,200 ఎకరాల భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బెదిరించి, రింగు చేసి, కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ఇవాళ ప్రజా ధనాన్ని వారికి కావాల్సిన వారికి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి కాలరీస్ అనే సంస్థలో 51 శాతం తెలంగాణ ప్రభుత్వానిది అయితే, 49 శాతం కేంద్ర ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కల్పించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆదేశాలివ్వాలని గవర్నర్‌ను కోరినట్లు పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై విచారణకు సిబిఐకి ఇస్తారా…లేక సిట్టింగ్ జడ్జికి ఇస్తారా.. మీ ఇష్టం ఇష్టం అని చెప్పారు. ప్రజా ధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థను, సోలార్ పవర్‌లో కుంభకోణం, సింగరేణి ఓబి గనుల్లో కుంభకోణాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ప్రజాధానాన్ని కొల్లగొట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని గవర్నర్‌ను కోరామని కెటిఆర్ అన్నారు.