
న్యూఢిల్లీ: భారతదేశం- యురోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం ప్రకటన సందర్భంగా అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయి డా కోస్టా… భారతదేశంలోని గోవాతో నాకు చక్కటి అనుబంధం ఉంది. నా తండ్రి, తాతా గోవాలో పుట్టిన వాళ్లే.. అంటూ భారతదేశంతో తనకు గల అనుబంధాన్ని వివరిస్తూ తన ఓసిఐ కార్డు తీసి చూపారు. ఇయు అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ప్రధాని నరేంద్రమోదీ లను ఆశ్చర్యానికి గురిచేస్తూ, కోస్టా తన గోవా అనుబంధాన్ని వివరించారు. గతంలో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవాలో ఆంటోనియో కోస్టా తండ్రి పుట్టి పెరిగారు. గోవా విముక్తి తర్వాత ఆయన 18 ఏళ్ల వయస్సులో పోర్చుగల్ కు వలస వెళ్లారు.
ఆంటోనియో కోస్టా తన చిన్నప్పటి కొంకణి పేరు బాబుష్ అని మంగళవారం ఉమ్మడి సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం యురోపియన్ కౌన్సిల్ చైర్మన్ అయినా, తాను కూడా విదేశీ భారతీయ పౌరుడినే అని తన జేబులోంచి ఓసిఐ కార్డును చూపుతూ కోస్టా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన 1015 నుంచి 2024 వరకూ పోర్చుగీస్ ప్రధానమంత్రిగా పని చేశారు. పోర్చుగీస్ ప్రధాని హోదాలో 2017లో భారతదేశంలో పర్యటించినప్పుడు గోవాలో తమ పూర్వీకులు ఉన్న ఇళ్లను కూడా సందర్శించారు. అప్పుడు కవి, రచయిత అయిన తన తండ్రి ఓర్లాండో కోస్టా రాసిన నాటకం ఆంగ్ల అనువాదాన్ని విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
కోస్టా 1961లో నిస్బన్ లో జన్మించినా, తల్లిదండ్రులతో కలిసి తన టీనేజ్ లో గోవాను సందర్శించినట్లు చెప్పారు. తన తా మార్గోవాలో పుట్టి ఎక్కువకాలం అక్కడే జీవించారన్నారు. తన తండ్రి లిస్బన్ వెళ్లినా గోవాను మరచిపోలేదని, గోవా పై రచనలు చేసేవారని పేర్కొన్నారు. గోవా లోని మార్గావ్ లో అబాదే ఫారియా రోడ్ లో 200 ఏళ్లనాటి తన పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉందని, తమ బంధువుల కుటుంబాలు ఇప్పటికీ అక్కడ నివసిస్తున్నట్లు తెలిపారు. 2017లో తాను ఆ ఇంటిని చూసి, తన కుటుంబసభ్యులతో మాట్లాడిన విషయం గుర్తు చేసుకున్నారు. 64 ఏళ్ల కోస్టా కు గోవా వారసత్వం, ప్రశాంచ చర్చల శైలి కారణంగా ఆయనను లిస్బన్ గాంధీ అని పిలుస్తారు. కోస్టా ప్రస్తుతం బ్రస్సెల్స్ నుంచి ఇయు కౌన్సిల్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నా…ఆయన ప్రసంగంలో గోవా ఓ భాగం అయింది.