Reading Time: < 1 minute

బులవయో: జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్19 ప్రపంచకప్‌లో యువ భారత జట్టు వరుస విజయాలతో అదరగొడుతోంది. మంగళవారం జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్స్ (గ్రూప్2) మ్యాచ్‌లో భారత్ 204 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరును సాధించింది. విహాన్ మల్హోత్రా అద్భుతసెంచరీతో చెలరేగి పోయాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన విహాన్ 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఓపెనర్లు అరోన్ జార్జ్ (23), వైభవ్ సూర్యవంశీ (52) జట్టుకు శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన వైభవ్ 30 బంతుల్లోనే 4 సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 52 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు సాధించాడు. ఖిలాన్ పటేల్ 12 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. దీంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత లక్షఛేదనకు దిగిన జింబాబ్వే యువ జట్టు 37.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. కియాన్ (37), లిరాయ్ (62), టటెండా (29) పరుగులు రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో మోహన్, అయుష్ మాత్రె మూడేసివికెట్లను పడగొట్టారు.