
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ మహాత్మాగాంధీ ఎన్‌ఆర్ ఇజిఏ నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో వ్యవహిస్తున్నదని, కార్మికుల వేతనాలపై చర్చించే హక్కును తొలగించడం, పంచాయతీల అధికారాలను కుదించడం వంటి చర్యలకు పాల్పడుతున్నదని లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు ఆరోపించారు. ఈ చర్యల ద్వారా ప్రధాని మోదీ దేశాన్ని రాజుల యుగానికి తిరిగి నెట్టివేస్తున్నారని ఆయన విమర్శించారు. అధికారం కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీ కృతమయినట్లు అన్పిస్తోందన్నారు.
ఎంజిఎన్‌ఆర్ ఇజి ఏ పై కార్మికులతో తాను జరిపిన సంభాషణ వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేశారు. ఉపాధి హామీ పథకం వారి జీవితాలను ప్రకటించిన కార్మికులు ఇప్పుడు మోదీ సర్కార్ కార్మికులను బానిసలుగా మారుస్తోందని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంజిఎన్‌ఆర్ ఇజిఏ ను మార్చడం వెనుక మోదీ అసలు ఉద్దేశ్యం ఏమిటి. కార్మికుల రోజువారీ వేతనాలను చర్చించే హక్కు తొలగించడం, పంచాయతీల అధికారాన్ని తొలగించి వారి చేతులు కట్టివేయడం, రాష్ట్రాల అధికారాన్ని తొలగించి, కేంద్రమే అధికారాలను హస్తగతం చేసుకోవడం దేనికి సంకేతం అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేద కార్మికుల జీవితాలలో విప్లవాత్మక మార్పు తెచ్చిందని,ఆ మార్పు రావడానికి దశాబ్దాల కాలం పట్టిందని ఆయన అన్నారు. ఆ పథకం వల్ల కనీస వేతనాలు, ఏడాది పొడవునా పనికి హామీ, స్వేచ్ఛ, గౌరవంతో పనిచేసేహక్కు లభించాయని లక్షలాది మంది కార్మికులు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. విబి- జి-రామ్ జి పథకాన్ని వెనక్కి తీసుకుని మహాత్మాగాంధీ ఉపాధి హామీ గ్యారంటి పథకాన్నే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. యుపిఏ ప్రవేశపెట్టిన ఎంజిఎన్‌ఆర్ ఇజిఏ రద్దుకు వ్యతిరేకంగా జనవరి 10 నుంచి 45 రోజులపాటు దేశవ్యాప్త ప్రచారాన్నికాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది.