Reading Time: < 1 minute

హైదరాబాద్: ట్రేడింగ్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని చెప్పి నగరానికి చెందిన బాధితుడి వద్ద నుంచి సైబర్ నేరస్థులు రూ.45లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని నల్లకుంటకు చెందిన వ్యక్తి(52)కి ఫేస్‌బుక్‌లో ఇన్వెస్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న ప్రకటనను చూశాడు. దానిపై క్లిక్ చేయడంతో స్టడీ సర్కిల్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లోకి వెళ్లాడు.

ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్న వారు ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ టెక్నిక్స్ టీచింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అందులో ఉన్న వారి పోస్టింగ్‌లు నమ్మిన బాధితుడు వారు చెప్పినట్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. దాని ద్వారా ముందుగా రూ.50వేలు పెట్టుబడిగా పెట్టాడు. సైబర్ నేరస్థులు ప్రొఫెసర్ ముఖుల్ కొచ్చారు, అతడి అసిస్టెంట్ పేరుతో బాధితుడితో మాట్లాడారు.

వచ్చే ఐసిఐసిఐ ప్రుడేన్షియల్, గ్లోబల్ ఓసియన్ లాజిస్టిక్స్ ఐపిఓలో పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పారు. సైబర్ నేరస్థుల మాటలు నమ్మిన బాధితుడు రూ.45,01,017 పెట్టుబడిపెట్టాడు. వాటికి రూ.6,19,49,304 లాభాలు వచ్చాయని చూపించారు. వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా అనుమతి ఇవ్వలేదు. వెంటనే సైబర్ నేరస్థులను సంప్రదించగా మరింత పెట్టుబడిపెట్టాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.