
న్యూఢిల్లీ: సర్వసత్తాక, అతి పెద్ద ప్రజాస్వామిక భారతదేశం సోమవారం 77వ గణతంత్ర దినోత్సవంతో దేశ భక్తిని చాటుకుంది. ప్రధాన ఉత్సవం దేశ రాజధాని ఢిల్లీలో కనుల పండువగా పరేడ్‌తో సాగింది. ఉగ్రవాద ఉన్మాదంపై భారతీయ సైన్యం విరుచుకుపడ్డ ఘట్టం ఆపరేషన్ సిందూర్ త్రివర్ణ పతాకాల రెపరెపల మధ్య మరోసారి రాజధానిలోని కర్తవ్యపథ్‌లో కళ్లముందుకు తీసుకువచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో వీర భారతీయ సైన్యం వాడిన ఆయుధాలు, క్షిపణులు, యుద్ధ విమానాల శ్రేణులను ప్రదర్శించారు. ఈ ఏటి గణతంత్ర దినోత్సవం జాతీయ గీతం వందేమాతరం ఆవిష్కరణానికి 150 ఏండ్లు నిండిన ఘట్టం ప్రధాన ఇతివృత్తం అయింది. భారత దేశ సరిహద్దుల రక్షణకు ఆయువుపట్టు అయిన భారతీయ సైనిక పాటవానికి ప్రతీక సిందూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. తెగబడి ఉగ్రవాద చర్యలకు దిగితే , వెంటబడి దెబ్బతీస్తామనే సిందూర్ సైనిక చర్య కేంద్ర బిందువు అయింది.
వందేమాతరం ఇతివృత్త కవాతుపై పూల వర్షం
నేలపై సాగుతున్న వందేమాతరం థీమ్ పరేడ్‌పై ఉన్నట్లుండి ఆకాశం నుంచి పూల వర్షం కురిపించారు. వాయుసేన ఆధ్వర్యంలో గగనతలం నుంచి నాలుగు ఎంఐ 17 హెలికాప్టర్లతో పూల వర్షం ఆకట్టుకుంది. వాయుసేనకు చెందిన 129 హెలికాప్టర్ల దళం గగనంలో ధ్వజం ఆవిష్కరించింది. రాష్ట్రపతి ముర్ము శాల్యూట్ తరువాత పరేడ్ ఆరంభం అయ్యింది . పరేడ్‌కు కమాంవర్ లెఫ్టినెంట్ జనరల్ ఢవనీష్ కుమార్ నాయకత్వం వహించారు. . పరేడ్‌లో ముందు వరుసలో గౌరవప్రదంగా పరమ వీర చక్ర గ్రహీతలు నిలిచారు. పరేడ్‌లో ఈసారి యూరోపియన్ యూనియన్‌కు చెందిన చిన్న దళం కూడా పాల్గొంటుంది.
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈసారి పరేడ్‌లో కళ్లముందుకు సైనిక యుద్ధ క్షేత్రం ముందుకు తీసుకువచ్చారు. సిందూర్‌లో వాడిన పలు స్వదేశీ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. దీనిని బ్యాటిల్ అరే ఫార్మాట్‌గా పేర్కొన్నారు. పరేషన్ సిందూర్ పేరిట సాగిన భారతీయ సైన్యపు శకటం విశేష ఆకర్షణగా నిలిచింది. త్రివిధ బలగాలు సమన్వయంతో ఎంతటి శక్తివంతంగా ఉంటాయనేది తెలిపారు. సిందూర్‌లో వాడిన మన ఆయుధాలు, నిఘా వ్యవస్థల్లోని పరిజ్ఞానం పరిచయం చేశారు. బ్రహ్మోస్ , ఆకాశ్ ఆయుధ వ్యవస్థలు, 300 కిలోమీటర్ల దూరం లక్షాలు ఛేదించే సూర్యాస్త్ర రాకెట్ లాంఛర్, యుద్ధ ట్యాంక్ అర్జున్ పటిమ చాటారు. ఈసారి కొత్తగా ఏర్పడిన భైరవ్, లైట్ కమాండో బెటాలియన్, శక్తిబన్ రెజిమెంట్ , రెండు మూపురాల ఒంటెలు, జన్‌స్కార్ అశ్వాలు మొదటిసారి కవాతులో పాల్గొన్నాయి. అశ్వికదళం, అపాచీతో పాటు ప్రచండ్ హెలికాప్టర్లు, నాగ్ క్షిపణి, దనుష్ గన్స్, హైటెక్ డ్రోన్లు తాము సైతం అంటూ ముందుకు వచ్చాయి. నేలపై ఈ కవాతు దశలోనే గగనతలంలో యుద్ధ విమానాలు వివిధ ఆకృతులతో సాహసాలకు దిగాయి. ధ్రువ్ చాపర్ సిందూర్ జండాను సగర్వంగా ఎగురవేసింది. 90 నిమిషాల ఇక్కడి పరేడ్‌ను పలు దేశాల ప్రజలు టీవీ ఛానళ్ల ద్వారా ఆసక్తితో తిలకించారు. భారత సైన్యం శక్తి, బహుముఖ సాంస్కృతిక రీతికి సలాం కొట్టారు.
ఈసారి పరేడ్‌లో సైనిక కవాతు దశలో మన దేశీయ ఆయుధ వ్యవస్థను ప్రదర్శించారు. దీనికి తోడుగా మిత్రపక్ష దేశం రష్యా తయారీ ఆయుధాలను, సమానంగా అమెరికా ద్వారా తెప్పించుకున్న రక్షణ వ్యవస్థలను నిలిపారు. శబ్ధ వేగాన్ని మించి దూసుకువెళ్లే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి అస్త్రాలు, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ , సూర్యశస్త్ర వంటివి ప్రధానంగా నిలిచాయి. పలు ట్యాంకులు ముందుకు సాగాయి. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతదేశపు శాంతిసమయపు సాహస పురస్కారం అశోక చక్రను వ్యోమగామి, గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లాకు ప్రదానం చేశారు. అభినందించారు. ఇతివృత్తం చాటుతూ దాదాపు వంద మంతి కళాకారులు వివిధత మే ఏకతా అనే శీర్షికతో ప్రదర్శన నిర్వహించారు. భారతీయ నావికాదళానికి 144 మంది గగనతల విన్యాసాలలో మొత్తం 29 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వీటిలో రాఫెల్, స్యూ 30 ఎంకెఐ, మిగ్ , జాగ్వార్‌లు తమ బలం ప్రదర్శించాయి. ఈసారి పరేడ్ దశలో ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్లకు దేశంలోని నదుల పేర్లు పెట్టారు. బియాస్, గంగ, బ్రహ్మపుత్ర సింధు, యమున, పెరియార్, రావి, చెనాబ్ వంటి నదులతో బోర్డులు పెట్టారు.