Reading Time: 2 minutes

భారత ఉపఖండంలో క్రికెట్ పిచ్‌లు వేడెక్కుతున్నాయి. సెగలు పొగలు కక్కుతున్నాయి. దీనికి కారణం మరో పది రోజుల్లో భారత్ – శ్రీలంక వేదికగా జరగబోయే టి20 ప్రపంచ కప్ కారణమని అనుకుంటే పొరబాటు. ఉపఖండం ప్రజలు తమ ప్రాణం కంటే ఎక్కువగా క్రికెట్‌ను అభిమానిస్తారు.. ఆరాధిస్తారు. అలాంటి ఆటలో రాజకీయాలు చొరబడి, ఆటను శాసించే స్థాయికి చేరుకోవడంతో ఒకప్పుడు దేశాలను దగ్గర చేసే ఆటగా పేరొందిన క్రికెట్ ఇప్పుడు దేశాల మధ్య చిచ్చు రాజేసే స్థితికి చేరింది. భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ రెండు జట్లూ తలపడేందుకు తటస్థ వేదికలే దిక్కవుతున్నాయి. తాజాగా టి20 ప్రపంచ కప్ పోటీలనుంచి వైదొలగిన బంగ్లాదేశ్‌తో భవిష్యత్తులో భారత్ ఆడే మ్యాచ్‌లకూ తటస్థ వేదికలు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఆటలోకి రాజకీయాలు చొరబడిన ఫలితమిదంటే అతిశయోక్తి కాదు. బంగ్లాదేశ్‌తో రాజకీయ సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం బంగ్లా క్రికెటర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను తమ జట్టులోకి తీసుకున్నందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడం ద్వారా తేనెతుట్టెను కదిపింది.

కేంద్రంలోని రాజకీయ పెద్దలను సంతోషపెట్టేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయంతో వివాదానికి అంకురార్పణ జరిగింది. బిసిసిఐ నిర్ణయానికి ప్రతిగా రానున్న టి20 ప్రపంచ కప్‌లో భారత్‌లో జరిగే మ్యాచ్‌లలో పాల్గొనబోమంటూ బంగ్లాదేశ్ భీష్మించడంతో పరిస్థితి చినికి చినికి గాలివానగా మారింది. నిజానికి బంగ్లాదేశ్ ఊహించినంత భద్రతాపరమైన సమస్యలేవీ భారత్‌లోలేవు. భారత్‌లో భద్రతా ఏర్పాట్లపై ఐసిసి నియమించిన కెనడా ఏజెన్సీ, భారత్‌లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లకు భద్రతాపరంగా ఎలాంటి ముప్పు వాటిల్లే ప్రమాదం లేదని తేల్చి చెప్పిన తర్వాతైనా బంగ్లాదేశ్ దిగిరాకపోగా, మొండిగా తమ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని కోరడం ద్వారా వివాదాన్ని తెగేదాకా తెచ్చుకుంది. ఒకవేళ బంగ్లా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుందామనుకున్నా, ఇప్పటికే భారత్‌లో తాము ఆడే మ్యాచ్‌ల కోసం ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఇతర దేశాల జట్ల మాటేమిటి? తగినంత వ్యవధి ఇవ్వకుండా ఆయా జట్లన్నింటినీ శ్రీలంకకు వెళ్లి ఆడమనడం సమంజసమేనా? పేదవాడి కోపం పెదవికి చేటన్నట్లు.. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును, మరీ ముఖ్యంగా ఆ దేశ ఆటగాళ్లను మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. టి20 ప్రపంచ కప్ నుంచి వైదొలగినందున బంగ్లా క్రికెట్ బోర్డుకు 240 కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లవచ్చునని అంచనా.

స్పాన్సర్‌షిప్, బ్రాడ్ కాస్ట్ రూపేణా వచ్చే ఆదాయంలో 60 శాతం కోతపడే ప్రమాదం లేకపోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో గోరుచుట్టుపై రోకటిపోటు అన్నట్లు బంగ్లా- భారత్ మధ్య ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరగవలసిన ద్వైపాక్షిక సిరీస్ కూడా రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. రాజకీయ కక్ష సాధింపుకోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం కొరివితో తలగోక్కున్న ఫలితమిది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని రాజకీయ పార్టీలు ఈ పరిణామాలపై కిమ్మనకపోయినా, అక్కడి మీడియా మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని దుయ్యబడుతోంది. పేరుకు క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చక్కబెడుతున్నా, పెత్తనం చెలాయించేది మాత్రం బిసిసిఐ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఐసిసి చైర్మన్ పదవిలో కేంద్ర హోం మంత్రి తనయుడే కొనసాగుతున్నందున బిసిసిఐ చెప్పినట్టల్లా ఐసిసి ఆడుతోందనే విమర్శలూ లేకపోలేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే క్రీడా సంఘాల్లోనే కాదు, ఆటల్లోనూ రాజకీయ నేతల జోక్యం తగ్గాలి. ఆటను వేరుగా, రాజకీయాలను వేరుగా చూసే పరిస్థితి రావాలి. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పటిష్టంచేసే ఆటగా క్రికెట్‌ను మాజీ ప్రధాని వాజపేయి పేర్కొనేవారు. 2004లో పాక్ లో పర్యటించబోయే భారత జట్టును ఉద్దేశించి ‘ఆటనే కాదు, అక్కడివారి మనసులనూ గెలుచుకు రండి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. ఇరు దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలను పెంపొందించే దిశగా క్రికెట్ ను రూపొందించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.