
మణిపూర్‌లో జాతిపరమైన హింస చెలరేగి దాదాపు రెండేళ్లు గడిచినా, ఇప్పటికీ రాష్ట్రం అసాధారణ రాజకీయ, సామాజిక పరిస్థితులతో కొట్టుమిట్టాడుతోంది. ఎన్. బీరేన్ సింగ్ ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గి, అధికారం కుప్పకూలిన తర్వాత అసెంబ్లీ సస్పెన్షన్, రాష్ట్రపతి పాలన అమలుతో మణిపూర్ నేడు రాజ్యాంగపరంగా లాంఛనంగా మిగిలింది. ప్రజాస్వామ్యం నామమాత్రంగా మిగిలింది. బఫర్ జోన్‌లు సమాజాలను విభజించాయి, సాయుధ గ్రూప్‌లు రోజువారీ జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులై శాశ్వత పునరావాసం కోసం ఎదురు చూస్తున్నాయి. మణిపూర్‌లో విషాదానికి కారణం. హింస మాత్రమే కాదు. నమ్మకం లేకపోవడం, దీర్ఘకాలంగా సాధారణ స్థితి పునరుద్ధరణ జరగకపోవడం, రాజకీయ చట్టబద్ధత పునరుద్ధరణలో ఘోర వైఫల్యం.
2023 మే లో మెయితీ, కుకీ- జో గ్రూప్‌ల మధ్య జరిగిన హింసాకాండ హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. భూ వివాదాలు, రాజకీయ ప్రాధాన్యత, గుర్తింపు లోపించిన అభివృద్ధి, చాలా కాలంగా నెలకొన్న మనోవేదనలకు పరాకాష్ట. అధికారంలో ఉన్న ప్రభుత్వం పక్షపాత ధోరణి వల్ల ఇది మరింత క్లిష్ట స్థితికి చేరింది. బీరేన్ సింగ్ సర్కార్ తటస్థంగా వ్యవహరించడంలో ఘోరంగా విఫలమైంది. స్వల్ప విభేదాలు జాతులమధ్య సాయుధ ఘర్షణగా మారేందుకు అనుమతించిందనే ఆరోపణలు ఉన్నాయి. హింస చెలరేగిన తర్వాత, జిల్లాలలో పరిపాలన చట్టబద్ధంగా అమలు చేయడం అసమర్థంగా వ్యవహరించారని రుజువైంది. సాయుధ వాలంటీర్లు, మిలిటెంట్ గ్రూప్‌ల రక్షణలో వాస్తవానికి ఆయా జాతుల ప్రాంతాలుగా భూభాగాన్ని విభజించారు. రాష్ట్రపతి పాలన విధించడం సమంజసమే. పాలన స్థిరీకరణకు, వైషమ్యాలు నివారించేందుకు అత్యవసర దిద్దుబాటు చర్యగా భావించారు. చాలా కాలంపాటు కేంద్రం పాలన వల్ల ఆటోమేటిక్‌గా సయోధ్య సాధ్యం కాలేదు. రాజకీయ పరంగా స్వస్థత చేకూరలేదు.
భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించడం వల్ల ఘర్షణల జోరు తగ్గి ఉండవచ్చు. కానీ, జాతుల మధ్య, పౌరులు, ప్రభుత్వం మధ్య నమ్మకం నెలకొని సంక్షోభం ఇంకా పరిష్కారం కాలేదు. మార్కెట్లు, స్కూళ్లు, రవాణా నెట్‌వర్క్ ఇప్పటికీ ఆయా అనధికార జాతి సరిహద్దులకే పరిమితమయ్యాయి. రాజకీయ సంభాషణలు పరిష్కారానికి దారితీయడం లేదు. నిరంతరం అస్థిరతనుంచి ప్రయోజనం పొందే తీవ్రవాదుల వల్ల అవి విఫలమవుతున్నాయి. ఇటీవలి పరిణామాలు ఈ దౌర్భాగ్య స్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. కుకీ ప్రాబల్యం గల చురచంద్ పూర్‌లో మెయితీ వ్యక్తి హత్యను రాజకీయ హెచ్చరికగా నమోదు చేసి ప్రచారం చేసినట్లు తెలిసింది. ఇది కేవలం నేరపూరిత చర్య కాదు, రాజకీయ ప్రక్రియకు విఘాతం కలిగించే లేదా ప్రభుత్వాన్ని సవాల్ చేసే చర్య. హింసాత్మక చర్యలకు పాల్పడేవారు చర్చలను పక్కదారి పట్టించేందుకు, సమాజాలను బెదిరించి ఒంటరిగా ఉంచేలా చేస్తారని ఇది సూచిస్తున్నది. ఇలాంటి సంఘటనలు విశ్వసనీయమైన రాజకీయ పరిష్కారం తక్షణ అవసరాన్ని వెల్లడిస్తాయి.
రాజకీయ సంభాషణలు చిన్నగా మొదలైన, చక్కటి అవకాశాలను చూపాయి. కేంద్రం మెయితీ, కుకీ -జో శాసనసభ్యుల మధ్య, అలాగే తిరుగుబాటు గ్రూప్‌ల మధ్య జరిపిన చర్చలు, ఆ కార్యకలాపాలు నిలిపివేయాలన్న ఒప్పందాలకు సూత్రప్రాయంగా దారితీస్తున్నా, నిరవధికంగా కేంద్రం పాలన ఆమోదయోగ్యం కాదని, రాజ్యాంగపరంగా కూడా సబబు కాదనే అభిప్రాయం వెల్లడైంది. ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న మెయితీల డిమాండ్ సమాజానికీ, రాష్ట్ర ప్రాదేశిక సమగ్రతకు వివాదాస్పదమై అంశం అయినప్పటికీ, గిరిజన సంస్థలు మొదటి సారిగా ప్రజాదరణ ప్రభుత్వంలో పాల్గొనేందుకు షరతులతో సంసిద్ధత వ్యక్తం చేయడం విశేషం. అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలనను మూడేళ్ల వరకూ కొనసాగవచ్చు. ఒక సంవత్సరం గడువు దాటితే, దానిని పొడిగించాలంటే, ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ధ్రువీకరించవలసి ఉంటుంది. ఎన్నికల రాజకీయాలను నిరవధికంగా వాయిదా వేయడం వల్ల అత్యవసర పాలన సాధారణమైపోతుంది. ప్రజాస్వామ్యపరమైన జవాబుదారీ తనం క్షీణిస్తుంది. ఈ పరిస్థితుల్లో సామాన్య పౌరులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించలేరు. ఇది శాంతియుత చర్చలు జరపడానికి రాజకీయ మార్గాలను దూరం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ మిగిలి ఉన్న పదవీకాలం కోసం పునరుద్ధరించడం వల్ల కొత్త నాయకత్వం లో ప్రభుత్వం ఏర్పాటు వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్నది కీలక మైన ప్రశ్న.
ఇన్ని అనర్థాలకు కారణమైన అదే రాజకీయ నాయకత్వాన్ని తిరిగి నియమించడం వల్ల ముఖ్యంగా కుకీ- జో వర్గాలలో అపనమ్మకం మరింత తీవ్రమవుతుంది. ప్రస్తుత అసెంబ్లీ నెట్‌వర్క్‌లో నాయకత్వం మార్పు, స్పష్టమైన సయోధ్య, నిబద్ధతలవల్ల రాజకీయ సాధారణీకరణకు అవకాశం ఏర్పడవచ్చు. అలాంటి ప్రభుత్వం పక్షపాత రహితంగా పనిచేస్తూ, ప్రజల విశ్వాసాలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలి. దాని చట్టబద్ధత మానవతా దృష్టితో పునరావాస సమస్యలు పరిష్కరించడం, నిష్పాక్షిక పోలీసింగ్‌ను నిర్ధారించడం, ఉద్యమ స్వేచ్ఛను రక్షించడం, కమ్యూనిటీల సమూహాలతో నిరంతరం సంభాషించడంపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు లేకుండా ఎన్నికైన ప్రభుత్వం పునరుద్ధరణ వల్ల ప్రయోజనం ఉండదు. మణిపూర్‌లో కేంద్రం పాత్ర ఇప్పటికీ కీలకమైనది. శాంతి భద్రతలు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం అంశం అయినా, మణిపూర్ సంక్షోభం, తిరుగుబాటు కార్యకలాపాలు, సరిహద్దు భద్రత, మానవతా బాధ్యతల వల్ల జాతీయ కోణాలు సంతరించుకుంది. కేంద్రం దృఢమైన దృక్పథంతో ముందుకు సాగాలి. పాలనా సంస్కరణలు, ఆర్థిక పునర్నిర్మాణాల విషయంలో స్థిరమైన శాంతి యుత నెట్‌వర్క్‌ను అవలంబించాలి. పునరావాస ప్యాకేజీలు పారదర్శకంగా ఉండాలి. భద్రతా దళాలకు సంస్థాగత జవాబుదారీతనం అన్నీ ఈ ప్రక్రియలో ముఖ్యం. స్థానిక భాగస్వాముల పాత్ర అంతే కీలకమైనది. ఈశాన్య భారతంలో సంఘర్షణ పరిష్కారంలో మేధావులు, విద్యార్థులు, మహిళా సంఘాలు, చర్చలు, పౌర సమాజం గతంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాయి. మణిపూర్‌లో పౌరసమాజం జాతులకు అతీతంగా లేదు.
ఇక్కడి సమాజాన్నిచక్కదిద్దాలంటే, అంతర్ – సమాజ చర్చావేదికల పునరుద్ధరణ, తటస్థ శాంతి కమిటీల పునరుద్ధరణ, వృత్తిపరమైన సంస్థలను రాజ్యాంగ హక్కులపై మాట్లాడేందుకు ప్రోత్సహించడం, సామాజిక ఐక్యత పునరుద్ధరణ కీలకం. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పక్షపాతంతో కూడిన కథనాలు, తప్పుడు సమాచారం విస్తరణ సయోధ్యను దెబ్బ తీస్తాయి. దీనిని ఎదుర్కోవడానికి నిరంతర పర్యవేక్షణ, వాస్తవ తనిఖీలు, బాధ్యతా యుతమైన జర్నలిజం కూడా అవసరం. విశ్వవిద్యాలయాలు, ఉపాధ్యాయ సంఘాలు, సాంసృ్కతిక సంస్థలు, శాంతిని పునరుద్ధరించడానికి అవసరమైన పౌరనీతిని చర్చలలో తీసుకు వచ్చేందుకు సహాయపడతాయి. మణిపూర్‌లో ఆర్థిక సంక్షోభం, స్తబ్ధతను ఎవరూ పట్టించుకోలేదు. పెట్టుబడులు నిలిచిపోయాయి. టూరిజం కుప్పకూలింది. ఎందరో జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. దీర్ఘకాలంగా పునరావాస శిబిరాలలో బతకడం యువతరాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వారికి హింస అనేది అధికారం, ఆదాయ మార్గంగా మారే ప్రమాదం ఉంది. వారికి ఉపాధి, అభివృద్ధి ప్యాకేజీలలో భాగస్వాములను చేయడం, నైపుణ్యాభివృద్ధి, ఉమ్మడి ఆర్థిక ప్రాజెక్టులను అనుసంధానం చేయాలి. ఇవి సమాజాల మధ్య సహకారం అవసరం.
మణిపూర్ విషాదానికి మూలం రాజకీయ ఊహాశక్తి వైఫల్యం. పాలనకు ప్రత్యామ్నాయంగా జాతి గుర్తింపును అనుమతించారు. భద్రతను సంభాషణలకు ప్రత్యామ్నాయంగా పరిగణించారు. ఎంత పోలీసింగ్ చేసినా, రాజకీయ చట్టబద్ధతకు ప్రత్యామ్నాయం కాదు. భూమి హక్కులు, పరిపాలన స్వయం ప్రతిపత్తి, అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం అవసరం. ప్రత్యేక పరిపాలన డిమాండ్లు, ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన ఆకాంక్షలు, కొన్ని వర్గాలలో భయాలు రాజ్యాంగపరమైన సంభాషణలలో చోటుచేసుకోవాలి. బహుశా, అన్నివర్గాలతో కూడిన పార్లమెంటు పర్యవేక్షణతో కూడిన సాధికారక కమిషన్ ద్వారా ఇది సాధ్యపడుతుంది. మణిపూర్ ప్రస్తుతం ఓ క్రాస్‌రోడ్‌లో ఉంది. గవర్నర్ పాలన తాత్కాలిక పరిపాలనా స్థిరత్వాన్ని అందించవచ్చు. కానీ, అది రాజకీయ సయోధ్యకు ప్రత్యామ్నాయం కాదు.
కొత్త నాయకత్వంతో ఎన్నికైన ప్రభుత్వానికి నాయకత్వం అప్పగించడం, ప్రజాస్వామ్యం సాధారణ స్థితికి తీసుకురావడం, కొత్త మార్గాన్ని సూచిస్తుంది. ఈ ఆవకాశాన్ని ఉపయోగించుకుంటారా లేక చక్కటి అవకాశాన్ని వృథా చేస్తారా అనేది రాజకీయ పార్టీల స్వల్పకాలిక ఎన్నికల లెక్కల కంటే, దీర్ఘకాలిక శాంతికి ఇచ్చే ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. మణిపూర్‌ను రక్షిత ప్రాంతంగా విభజించినంతకాలం, సమాజాల మధ్య విభజన మరింత తీవ్రతరం అవుతుంది. పునరేకీకరణ కష్టతరం అవుతుంది. చికిత్స అనేది కేవలం ఆదేశాల వల్ల సాధ్యం కాదు. ఓర్పు, సహనం అవసరం. సూత్రప్రాయ రాజకీయాల ద్వారా దానిని పరిష్కరించాలి. మణిపూర్‌లో కేవలం హింస సద్దుమణగడమే కాదు. ప్రజలలో విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. అన్నివర్గాలకు ధైర్యం కల్పిచాలి. రాజీధోరణి, రాజ్యాంగం పట్ల విశ్వసనీయత అవసరం.
గీతార్థ పాఠక్