
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెల 27వతేదీ మంగళవారం అఖిలపక్ష భేటీ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ ఆదివారం తెలిపారు. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని మొయిన్ కమిటీ రూంలో ఉదయం 11 గంటలకు దీనిని ఏర్పాటు చేశారు. అందరికి సమాచారం పంపించారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఈ నెల 28వ తేదీన ప్రారంభం అవుతుంది. తొలిదశ ఫిబ్రవరి 13న ముగుస్తుంది. అయితే విరామం తరువాత తిరిగి మార్చి 9న ఆరంభం అయ్యే సెషన్ ఏప్రిల్ 2 వరకూ ఉంటుందని మంత్రి వివరించారు. 29న ఆర్థిక సర్వే ప్రవేశపెడుతారు.
సెషన్ ఆరంభం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభ, లోక్‌సభ సంయుక్త సమావేశాన్ని ఉద్ధేశించి ప్రసంగిస్తారు. పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆదివారం అయినప్పటికీ సమర్పిస్తారు. ఇక ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టే తొమ్మిదవ కేంద్ర బడ్జెట్ ఇది. రికార్డుగా మారుతుంది. బడ్జెట్ సమర్పణ తరువాత ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకూ మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చ జరుగుతుంది. జనవరి 28, ఫిబ్రవరి 1వ తేదీలలో జీరో అవర్ ఉండదని అధికారిక వర్గాలు తెలిపాయి.