
న్యూఢిల్లీ: నేడు జరగనున్న భారత్, యురోపియన్ యూనియన్ (ఇయు) సమ్మిట్‌లో చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై కీలక ప్రకటన వెలువడనుంది. ఈ సమ్మిట్‌లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల ముగింపు ప్రకటన, వ్యూహాత్మక రక్షణ ఒప్పందం, అలాగే మొబిలిటీ కార్మికులపై అవగాహన ఒప్పందం ఉండనున్నాయి. అమెరికా విధానాలతో ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సంక్షోభం నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్‌డర్ లెయెన్, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా భారత్‌కు విచ్చేశారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆతిథ్యం ఇవ్వగా, సోమవారం జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కోస్టా, వోన్‌డర్ లెయెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉర్సులా మాట్లాడుతూ, విజయవంతమైన భారత్ ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సురక్షితంగా, సంపన్నంగా మారుస్తుంది. ఈ ప్రయోజనం అందరికీ అందుతుందని అన్నారు. ఆమె గత వారం మాట్లాడుతూ, భారత్, యూరోపియన్ యూనియన్ ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నాయని తెలిపారు.
ఈ ఒప్పందం అమలైతే దాదాపు 2 బిలియన్ల జనాభాతో, ప్రపంచ జిడిపిలో సుమారు పావు వంతు వాటా ఉన్న మార్కెట్ ఏర్పడనుంది. భారత్, ఇయు మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదటిసారిగా 2007లో ప్రారంభమయ్యాయి. అయితే ఆశయాల్లో భిన్నాభిప్రాయాల కారణంగా 2013లో ఈ చర్చలు నిలిచిపోయాయి. మళ్లీ 2022 జూన్‌లో ఈ చర్చలు పునఃప్రారంభమయ్యాయి. ఈ ఒప్పందం అమలైతే వాణిజ్యం, పరిశ్రమలు, ఉద్యోగాలు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని అంచనా వేస్తున్నారు. సమ్మిట్‌లో వాణిజ్యం, రక్షణ, భద్రత, వాతావరణ మార్పు, కీలక సాంకేతికతలు, అంతర్జాతీయ నియమాల ఆధారిత వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత్, ఇయు 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతిపాదిత భద్రతా, రక్షణ భాగస్వామ్య ఒప్పందం ద్వారా రక్షణ రంగంలో సమన్వయం పెరుగుతుంది. అలాగే యూరోపియన్ యూనియన్ సేఫ్ (సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్) కార్యక్రమంలో భారత కంపెనీలు పాల్గొనే అవకాశాలు ఏర్పడతాయి. భారత కార్మికులు యూరప్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం చేసే మొబిలిటీ ఒప్పందం కార్యరూపం దాల్చనుంది.