Reading Time: 3 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుందని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు అని, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న రాక్షస పాలన అని దుయ్యబట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భం గా సోమవారం తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ కుమార్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ ఉల్లంఘనలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ  విద్యార్థులు ప్రదర్శించిన లఘు నాటిక అందరినీ ఆలోచింపజేసింది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, హెచ్‌సియు విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చేశారని అభినందించారు.

రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రతిసారీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని కెసిఆర్ అద్భుతంగా ఆకళింపు చేసుకొని తెలంగాణను సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు. అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3, అంబేద్కర్ ఆలోచనా విధానం వల్లనే నేడు అల్పసంఖ్యాక వర్గాలకు న్యాయం జరుగుతున్నదని, ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడుతున్నాయని అన్నారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ పోటీపడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తి సరైనోడు కాకుంటే ప్రయోజనం శూన్యమని ఆనాడే అంబేద్కర్ వెల్లడించారని చెప్పారు. సరిగ్గా అదే పరిస్థితి కేంద్రం, రాష్ట్రాల్లో కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి ఒకవైపు, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న కాంగ్రెస్ మరోవైపు దేశానికి పెనుముప్పుగా మారాయని అన్నారు.

న్యాయ పత్రం కాదు.. అది అన్యాయ పత్రం

కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ తుక్కుగూడలో విడుదల చేసిన న్యాయ పత్రంలో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడారని..కానీ, ఆ వేదికపైనే బిఆర్‌ఎస్ నుండి పార్టీ ఫిరాయించిన వారు ఆయన పక్కనే కూర్చున్నారని గుర్తు చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, కాంగ్రెస్ న్యాయ పత్రంలో న్యాయం అంతే ఉందని ఎద్దేవా చేశారు. దానిని అన్యాయ పత్రంగా పిలవాలని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి జెండా గద్దెలను కూల్చేయండి అని బహిరంగ సభల్లో పిలుపునివ్వడం శాంతిభద్రతలను, రాజ్యాంగ విలువలను సమాధి చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అణగారిన వర్గాలపై దాడులు..లాకప్ డెత్‌ల ప్రభుత్వం

రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, జర్నలిస్టులపై జరుగుతున్న అకృత్యాలను కెటిఆర్ ఏకరువు పెట్టారు. కోదాడలో దళిత యువకుడు కర్రా రాజేష్‌ను పోలీస్ కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపారని, ఇది జరిగి 60 రోజులు గడిచినా ముఖ్యమంత్రి కానీ, స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడలో కర్ర రాజేష్ లాకప్ డెత్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులను ఉగ్రవాదుల మాదిరిగా అరెస్ట్ చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విలువల హననం కాదా..? అని ప్రశ్నించారు. లగచర్లలో గిరిజన ఆడబిడ్డల ఇళ్లలోకి చొరబడి వారి వ్యక్తిత్వ హననం చేయడం, భూముల కోసం పోరాడుతున్న రైతులను జైళ్లలో పెట్టడం ఈ ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమని అన్నారు. హైడ్రా, మూసీ పేరిట పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం, లగచర్లలో గిరిజన ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం చేయడం రేవంత్ రెడ్డి రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు. రైతు, యువజన, ఎస్‌సి, ఎస్‌టి, బిసి డిక్లరేషన్ల పేరుతో అందరినీ మోసం చేశారని,

2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారో కళ్లకు కట్టేలా తమ లఘు నాటిక ద్వారా వివరించారని అన్నారు. తమ యూనివర్సిటీ భూముల పైన దౌర్జన్యం చేసిన రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వంపైన యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ఇందులో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సియు భూముల్లో కుంభకోణం విషయంలో ఆ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని కెటిఆర్ అభినందించారు. బాధ్యత గల విద్యార్థులుగా తమ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి కాపాడుకోవడానికి వారు చేస్తున్న కృషి దేశాన్నే కదిలించిందని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చెరబట్టే ప్రయత్నం చేశారని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ. 10,000 కోట్లు ఉంటుందని, తనకు సంబంధం లేని భూములను, చెరువులను తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి ఫైనాన్షియల్ ఫ్రాడ్‌కు పాల్పడ్డారని ఆ నివేదిక స్పష్టం చేసినట్లు కెటిఆర్ పేర్కొన్నారు. హెచ్‌సియు భూముల వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదని కెటిఆర్ నిలదీశారు.

తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవం సోమవారం బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్‌లో సోమవారం పార్టీ సీనియర్ నేత మధుసూదనాచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.