
ప్రతి సంవత్సరం మాదిరిగా, ఈ ఏడాది పదవ తరగతి, ఇంటర్ మీడియట్ పరీక్షల సందడి మొదలయ్యాయి. ఈ సమయంలో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో ఒక రకమైన ఆందోళన, ఒత్తిడి మొదలవుతుంది. ఈ ఒత్తిడినే సాధారణంగా పరీక్షల ఫీవర్ అని అంటాం. ఇది సరైన దిశలో లేకపోతే విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పనితీరు మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే సరైన ప్రణాళిక, సానుకూల దృక్పథం, పరస్పర సహకారం ఉంటే ఈ పరీక్షల ఫీవర్‌ను సులభంగా అధిగమించవచ్చు. పరీక్షల ఫీవర్ అనేది పరీక్షల ముందు లేదా సమయంలో కలిగే భయం, ఆందోళన, ఒత్తిడి, ఆత్మవిశ్వాస లోపం వంటి భావాల సమాహారం. ఎక్కువ మార్కులు సాధించాలనే ఆశ, ఇతరులతో పోలిక, కుటుంబ ఆశలు, భవిష్యత్ భయం ఇవన్నీ దీనికి కారణాలు. కొందరు విద్యార్థుల్లో ఇది నిద్రలేమి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి శారీరక లక్షణాలూ కనిపిస్తాయి. వీటిని అధిగమించాలంటే విద్యార్థులు ముందుగా పరీక్షలను ఒక భారంగా కాకుండా ఒక అవకాశంగా చూడాలి. తమ నైపుణ్యం, సామర్థ్యాలను రుజువు చేసుకునే వేదికగా భావించాలి. దానికి చక్కటి ప్లానింగ్ అవసరం.
సిలబస్‌ను భాగాలుగా విభజించి, రోజువారీ టైమ్ టేబుల్ తయారు చేసుకోవాలి. చివరి నిమిషంలో అన్నీ చదవాలనే ప్రయత్నం వృథా ప్రయాస అవుతుంది. నిరంతర రివిజన్‌లో భాగంగా ఒకసారి చదివిన విషయాన్ని మళ్లీమళ్లీ పునశ్చరణ చేయడం వల్ల భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, సరిపడ నిద్ర, పోషకాహారం, తగినంత మంచినీరు తాగడం చాలా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటేనే చదువు సక్రమంగా సాగుతుంది. సానుకూల ఆలోచనలు నేను చేయగలను, నాకు తెలుసు అనే ధైర్య వాక్యాలు (Positive Affirmations) మనసుకు బలం ఇస్తాయి. ఇతరుల మార్కులతో పోల్చుకోవడం ఒత్తిడిని పెంచుతుంది. ప్రతి ఒక్కరి సామర్థ్యం వేరు అన్నది గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వారి మాటలు విద్యార్థుల్లో భయం కూడా కలిగించవచ్చు, ధైర్యమూ నింపవచ్చు. ప్రేరణాత్మకంగా బోధన జరగాలి, భవిష్యత్ ఆశలు చిగురించేలా ఆశలు పుట్టాలి. మార్కుల కంటే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. తప్పులను భయపెట్టేలా కాకుండా సరిదిద్దేలా చెప్పాలి. కఠినమైన పాఠాలను సులభమైన ఉదాహరణలతో వివరించాలి. ఇది విద్యార్థులలో నమ్మకాన్ని పెంచుతుంది. బ్లూప్రింట్, అకడమిక్ స్టాండర్డ్ ఆధారంగా బోధన జరిగితే మరింత ప్రయోజనం అని విద్యార్థులకు తెలియజేయాలి.
పరీక్ష వాతావరణాన్ని ముందే అలవాటు చేయడానికి నమూనా పరీక్షలు, స్లిప్ టెస్టులు ఎక్కువగా నిర్వహించాలి. కొందరు విద్యార్థులు భయంతో తమ సమస్యలు చెప్పలేరు. అలాంటి వారిని గమనించి స్నేహపూర్వకంగా మాట్లాడి, ప్రధాన అంశాలపై దృష్టిపెట్టాలి. ప్రతి రోజూ మానిటరింగ్ తప్పక జరగాలి. ఈ పరీక్షే జీవితం అనే భావన రాకుండా పరీక్షలు జీవితంలో ఒక భాగమే అన్న సందేశాన్ని ఇవ్వాలి. తల్లిదండ్రుల ఆశలు సహజమే. కానీ అవి ఒత్తిడిగా మారితే పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకొని ఆశలు పెట్టుకోవాలి. అసాధ్యమైన లక్ష్యాలు భయాన్ని పెంచుతాయి. మరికొద్ది మంది విద్యార్థులు ఇప్పటివరకు ఏమి చదవకుండా కాలయాపన చేస్తున్న వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లలపట్ల కోపగించుకోవడం, పొరుగింటి పిల్లలతో లేదా బంధువుల పిల్లలతో పోల్చడం పూర్తిగా మానుకోవాలి. వారి మానసిక స్థితిని బట్టి ప్రోత్సాహించాలి. మేము నీతో ఉన్నాం అనే భావన పిల్లలకు గొప్ప ధైర్యం ఇచ్చేలా ఉండాలి.
ఇంట్లో ప్రశాంతమైన, సానుకూల ధ్యాన వాతావరణం కల్పించాలి. అనవసర విమర్శలు, గొడవలకు దూరంగా ఉంచాలి. మార్కులు తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా మనం సపోర్ట్ గా ఉండాలే తప్ప, పిల్లల మనసు బలహీన పరిచేదిగా ఉండకూడదు. సమాజం కూడా పరీక్షల ఫీవర్‌ను తగ్గించడంలో పాత్ర వహించాలి. మార్కుల ఆధారంగా పిల్లల విలువ నిర్ణయించే ధోరణి తగ్గాలి. క్రీడలు, కళలు, నైపుణ్యాలు కూడా సమానంగా గౌరవించాలి. ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ పరీక్షలు జీవితానికి ముగింపు కాదు, ఒక దశ మాత్రమే. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముగ్గురూ కలిసి సానుకూలంగా ఆలోచిస్తే పరీక్షల ఫీవర్‌ను సులభంగా అధిగమించవచ్చు. భయం కాకుండా ధైర్యం, ఒత్తిడి కాకుండా ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడే విద్యార్థులు నిజమైన విజయం సాధిస్తారు. పరీక్షల్లో మాత్రమే కాదు, జీవితంలో కూడా నిలబడగల శక్తిని వారు పొందుతారు.
ఎల్. ఉపేందర్
99494 92677