Reading Time: 3 minutes

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన మంత్రుల మధ్య విభేదాలకు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ పలు కొత్త వివాదాలకు తెరతీసినట్లయింది. సిపిఐ వందేళ్ళ ఉత్సవంలో పాల్గొనడానికి జనవరి 18న ఖమ్మం జిల్లాలో పర్యటించిన సిఎం పర్యటన యాదృచ్ఛికంగా పలు అంశాలు కలిసి వచ్చినప్పటికీ ఇప్పుడు అవే వివాదాస్పదం అయ్యాయి. సందర్భోచితంగా అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించినప్పటికీ కొత్త వివాదాలకు ఆజ్యం పోసినట్లయింది. సిపిఐ వందేళ్ళ ఉత్సవంతోపాటు అదే రోజు మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు పాలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ రెండు సభలో ముఖ్యమంత్రి చేసిన ఉద్వేగపూరితమైన ప్రసంగం అక్కడ కాంగెస్ కార్యకర్తలను, ఇక్కడ సిపిఐ శ్రేణులను పరోక్షకంగా తెలుగుతమ్ముళ్ళను ఉత్సాహపర్చినట్లయింది. ఒకే వేదికపై దివంగత ముఖ్యమంత్రులు ఎన్‌టి రామారావును, డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డిలను కీర్తిస్తూ చేసిన ప్రసంగంలో గులాబీ దిమ్మెలను కూల్చివేయాలని తెలుగు తమ్ముళ్ళకు పిలుపు ఇవ్వడం కొంత వివాదంగా మారగా, ఒక కాంగ్రెస్ పార్టీ సిఎం కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కాన్పూర్‌లో పుట్టిన సిపిఐ పార్టీ వందేళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఉద్యమాల పురిటిగడ్డ ఖమ్మం గుమ్మంలో గత నాలుగు రోజులపాటు జరగగా, ముగింపు ఉత్సవాలను ఉత్సాహపూరితంగా జరుపుకొన్న ఆ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపినట్లయింది. ఈ ఉత్సవాలకు తొలిరోజు ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సిఎం రేవంత్‌రెడ్డిని సౌహార్ద్ర సందేశం ఇవ్వడానికి ఆహ్వానించారు. మిత్రపక్ష పార్టీ కావడంతో సిపిఐ పార్టీ అడగగానే సిఎం అంగీకరించి ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభకు సిఎంను ఆహ్వానించడంపై అటూ సిపిఐ, ఇటూ కాంగ్రెస్ పార్టీలో ఒకింత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం బయట ఉన్న సిపిఐ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ఆ పార్టీ ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు చేసిన విమర్శలతో కొంతమంది కాంగ్రెస్ నేతల మనస్సు నొచ్చుకొని సిఎం ఆ సభకు వెళ్ళడాన్ని అంతర్గతంగా తప్పు పట్టినప్పటికీ కమ్యూనిస్టుల సభలకు కమ్యూనిస్టుయేతర సిఎంలు పాల్గొన్న సందర్భాలు ఇదే తొలిసారి కాదు.

గతంలో చాలా సందర్భాల్లో ఇతర పార్టీల సిఎంలు పాల్గొన్న ఉదంతాలు భారత రాజకీయాల్లో అనేకం ఉన్నాయి. సాధారణంగా రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ రాజకీయాల్లో భావసారూప్యత కలిగిన పార్టీల మధ్య లేదా రాజకీయ అవసరాల రీత్యా ఇటువంటి కలయికలు అరుదుగా జరుగుతుంటాయి. యాదృచ్ఛికంగా ఇదే జనవరి 18న 2023 సంవత్సరంలో నాటి టిఆర్‌ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)గా అవిర్భవించిన సందర్భంగా ఇదే ఖమ్మం నగరంలో కొత్త కలెక్టరేట్ సమీపంలో కెసిఆర్ పార్టీ ఏర్పాటు చేసిన తొలిభారీ బహిరంగ సభకు, ఆనాటి సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, కేరళ సిఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సభలో పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి గత ఏడాది సిపిఎం పార్టీ అనుబంధ పత్రిక దశమ వార్షికోత్సవ వేడుకల్లో సిఎం హోదాలో పాల్గొన్నారు. అంతేగాక 2022లో కేరళలోని కన్నూర్‌లో జరిగిన సిపిఎం 23వ జాతీయ కాంగ్రెస్ (ప్లీనరీ)కు తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. కేంద్ర -రాష్ట్ర సంబంధాలపై జరిగిన సెమీనార్‌లో కూడా ఆయన ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల్లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్న సమయంలో 2004లో కాంగ్రెస్, వామపక్షాలు పొత్తులో ఉన్నప్పుడు, అప్పటి సిఎం వై.ఎస్. రాజశేఖర రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహించిన పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

సిపిఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభా వేదికద్వారా సిఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం కామ్రేడ్లను ఉత్సహ పరిచిందని చెప్పుకోవచ్చు. గడిచిన వందేళ్ళ కాలంలో కమ్యూనిస్టులు చేసిన ఫోరాటాల ఫలితంగానే అటూ కేంద్రం, ఇటూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక చట్టాలను, పథకాలను తీసుకొచ్చిందని చెప్పకనే చెబుతూ మరో వందేళ్ళు ప్రజలకోసం పోరాటాలు చేయాలనే ఇదే సభ వేదిక ద్వారా కమ్యూనిస్టు శ్రేణులకు పిలుపు ఇచ్చారే గాని మీ పోరాటాలు అవసరం లేదు. మీ ఉద్యమాలతో పని లేదు, మీరు ఏమి కోరినా, ప్రజల కోసం మీరు ఏం అడిగినా తమ ప్రజాప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని మాత్రం ఈసభా వేదిక మీద ద్వారా రేవంత్‌రెడ్డి చెప్పలేకపోయారు. మీరు పోరాటాలు చేస్తుంటే తాము చట్టాలను చేసుకుంటూ వెళ్తామని ఆయన చేసిన ప్రసంగం కామ్రేడ్లను సైతం అకట్టుకుంది. అదే రోజు సిపిఐ సభకు ముందు ఇదే ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దూమారం రేపాయి. తెలంగాణలో హైదరాబాద్ తరువాత ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కొంతమేర టిడిపి బలంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని సిఎం రేవంత్‌రెడ్డి ఆనాడు తెలంగాణలో టిడిపి లేకుండా కక్ష కట్టి కుట్ర చేసిన బిఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలను సమూలంగా కూల్చివేయాలని ఈ సభావేదిక ద్వారా సిఎం రేవంత్‌రెడ్డి టిడిపి కార్యకర్తలకు బహిరంగ పిలుపు ఇచ్చి త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం కొంత వివాదాస్పదమైంది.

ఒక సిఎం హోదాలో రెచ్చగొట్టే విధంగా బహిరంగ పిలుపు ఇవ్వడంపై బిఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టి ఏకంగా పలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేశారు. అంతేగాక తెలంగాణలో మట్టికరిచిన టిడిపిని తిరిగి బతికించడానికి రేవంత్‌రెడ్డి ఎత్తుగడలకు పాల్పడుతున్నారా? అనే అనుమానాలను ఈ సందర్భంగా గులాబీ నేతలు వ్యక్త పరచగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టిడిపిని మళ్ళీ తెలంగాణలో పునఃప్రతిష్టించే విధంగా సిఎం మాట్లాడిన తీరును సీనియర్ కాంగ్రెస్ నేతలుసైతం తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో ఖమ్మం, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతలలో మాత్రమే ఈనాటికీ తెలుగుదేశం పార్టీ బలంగా వుంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందేలా ఎన్‌టిఆర్ వర్ధంతి రోజున సిఎం రేవంత్ వ్యూహాత్మకంగా మాట్లాడినప్పటికీ అది రెండు వైపులా విమర్శలకు తావిచ్చినట్లయింది. ఇది ఇలా ఉంటే యాదృచ్ఛికంగా ఇదే రోజు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తూ ఒక పత్రికలో వచ్చిన వార్తకు, అంతకుముందు మరో మంత్రి కోమటిరెడ్డిని ఉద్దేశిస్తూ అదే పత్రిక, టివిలో వచ్చిన కథనాలకు ఇదే సభా వేదిక ద్వారా మంత్రుల మధ్య ఉన్న విభేదాలను పుల్‌స్టాప్ పెట్టేందుకు సిఎం చేసిన ప్రయత్నం కొంతమేర ఫలించినట్లయింది.

ఏదైన సమస్య ఉంటే తన దృష్టికి తీసుకొచ్చి వివరణ తీసుకొని ప్రచురించాలని, తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని చెబుతూ, సింగరేణి బొగ్గుగనుల టెండర్లలో అణాపైసా అవకతవకలకు ఆస్కారం లేదని ఉద్దేశపూర్వకంగా మంత్రుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తేలేదని మీడియాకు హెచ్చరిస్తూ సంబంధం లేని వ్యవహారాల్లోకి మంత్రులను లాగి బద్నాం చేయవద్దని, మరోసారి మంత్రుల జోలికొస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండని సిఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభావేదిక ద్వారా మీడియాను కోరడంతో అప్పటివరకు మంత్రులు, మీడియా మధ్య ఉన్న వివాదానికి తాత్కాలికంగా తెర దించినట్లయింది. మొత్తం మీద ఒక్క రోజు ఖమ్మం జిల్లా సిఎం పర్యటన పలు విభేదాలకు చెక్ పెట్టగా, మరికొన్ని వివాదాలకు ఆజ్యం పోసినట్లయింది.

వనం వెంకటేశ్వర్లు

98489 97240

(ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)