
జైపూర్ : రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో పోలీసుల వేటలో 10000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాల దశలోనే ఈ మందుగుండు సామాగ్రి ఒకటే చోట దొరకడం సంచలనానికి దారితీసింది. థావ్లా పోలీసు స్టేషన్ పరిధిలోని హర్సౌర్ గ్రామంలో నిర్మానుష్యపు ఫార్మ్‌హౌస్‌లో దీనిని గుర్తించారు. ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై తనిఖీల సందర్భంగా ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ సోదాల సందర్భంగా సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక్కడ భారీ స్థాయిలో స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఎర్రకోట వద్ద ఉగ్రవాదుల బాంబు పేలుడుకు వాడిన మందుగుండు సామాగ్రి రాజస్థాన్ నుంచే సరఫరా అయిందని ప్రాధమికంగా తెలిసింది. అయితే ఇప్పటి రికవరికి ఎర్రకోట ఘటనకు సంబంధం ఉన్నదీ లేనిదీ నిర్థారణ కాలేదు. అక్రమ మైనింగ్‌కు ఈ పేలుడు పదార్థాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడైందని జిల్లా ఎస్‌పి మృదుల్ కచ్చావా తెలిపారు. ఇక్కడ పోలీసుల తనిఖీలో 187 సంచుల్లో అమ్మోనియం నైట్రేట్‌ను కనుగొన్నారు. పలు డిటోనేటర్లు, వైర్లు కూడా లభ్యం అయ్యాయి. అక్రమ తవ్వకాలకు అవసరం అయిన వస్తువులను తాను ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నట్లు అరెస్టు అయిన సులేమాన్ ఖాన్ తెలిపాడు.