Reading Time: < 1 minute

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ జన్నిక్ సినర్ (ఇటలీ), నాలుగో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), నాలుగో సీడ్ అమందా అనిసిమోవా (అమెరికా), ఐదో సీడ్ ఎలినా రిబకిన (కజకిస్థాన్) తదితరులు ప్రిక్వార్టర్ ఫైనల్ పోటీల్లో విజయం సాధించి ముందంజ వేశారు. రెండో సీడ్ స్వియాటెక్ 60, 63 తేడాతో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మాడిసన్ ఇంగ్లిస్‌ను ఓడించింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన స్వియాటెక్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్ కూడా అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రిబకిన 61, 63తో ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది.

అనిసిమోవా మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లో చెమటోడ్చి నెగ్గింది. చైనాకు చెందిన వాంగ్‌తో జరిగిన పోరులో అనిసిమోవా 76, 64తో జయకేతనం ఎగుర వేసింది. మరో పోటీలో ఆరో సీడ్ జెస్సిక పెగులా (అమెరికా) జయభేరి మోగించింది. అమెరికాకే చెందిన మాడిసన్ కీస్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పెగులా 63, 64తో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సినర్ 61, 63, 76తో ఇటలీకే చెందిన డార్డెన్‌ను ఓడించాడు. మూడో సెట్‌లో సినర్‌కు గట్టి పోటీ ఎదురైనా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక చెక్ రిపబ్లిక్ ఆటగాడు మెన్సిక్‌తో జరిగిన పోరులో జకోవిచ్‌కు వాకోవర్ లభించింది. మరో పోటీలో 8వ సీడ్ బెన్ షెల్టన్(అమెరికా) విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కుచేరుకున్నాడు. ఐదో సీడ్ ముసెట్టి (ఇటలీ) కూడా ముందంజ వేశాడు.