Reading Time: < 1 minute

ఢాకా: బంగ్లాదేశ్‌లోని నార్సింగ్డి జిల్లాలో హిందూ యువకుడిని సజీవదహనం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుమిల్ల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన చంచల్ చంద్రా బౌమిక్ అనే యువకుడు(23) గ్యారేజీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నార్సింగ్డి ప్రాంతంలో తన తల్లి, వికలాంగుడైన తమ్ముడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మసీదు వీధిలో గత ఆరు సంవత్సరాల నుంచి గ్యారేజీలో పని చేస్తూ తండ్రి లేకపోవడంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అల్లరి మూకలు దుకాణంపై దాడి చేసి షట్టర్ మూసివేశారు. అనంతరం నిద్రపోతున్న చంచల్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టారు. చనిపోయాడని నిర్దారించుకున్న తరువాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై స్థానిక హిందువులు తీవ్రంగా ఖండించారు. నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు భద్రత పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయి. భారతదేశ వ్యతిరేక రాడికల్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తరువాత ఈ దాడులు జరుగుతున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. గతంలో బంగ్లాదేశ్‌లో దీపు చంద్రదాస్, ఖోకొన్ చంద్రదాస్‌ను అల్లరిమూకలు చంపేసిన విషయం తెలిసిందే.