Reading Time: < 1 minute

గతేడాది జరిగిన ఇంగ్లండ్ టెస్ట్‌ సిరీస్‌కి ముందు టెస్ట్‌ క్రికెట్‌కి రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కేవలం వన్డేల్లో కొనసాగుతున్న అతడిని వన్డే జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను శుభ్‌మాన్ గిల్‌కు అప్పగించారు. దీనిపై అప్పట్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. తాజాగా ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ. రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించడం వెనక చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ల కుట్ర ఉందని తివారీ ఆరోపించారు.

‘‘అగార్కర్ సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించడు. అయితే.. అతడి నిర్ణయం వెనక వేరొకరి పాత్ర కూడా ఉండొచ్చు. అగార్కర్ ఒక్కడే ఇంత పెద్ద సాహసం చేయడు. కోచ్ సూచనల ప్రకారమే చీఫ్ సెలక్టర్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు. దీనికి ఇద్దరూ బాధ్యులే’’ అని మనోజ్ తివారీ ఓ క్రీడా ఛానల్‌తో అన్నారు. టి-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన కెప్టెన్‌ను పక్కన పెట్టి.. అతడి బాధ్యతలను మరొకరికి అప్పగించడం సమంజసం కాదని మండిపడ్డారు. అది రోహిత్‌ను అవమానించినట్లే అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.