Reading Time: < 1 minute

తమిళ స్టార్ నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమాకు సంబంధించి సుప్రీంకోర్టులో జనవరి 15, 2026 ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ వివాదంపై నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.ఈ సినిమాలో కొన్ని రాజకీయ సన్నివేశాలు మరియు సంభాషణలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని రివ్యూ కమిటీకి పంపాలని నిర్ణయించింది.దీంతో నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. వెంటనే ‘U/A 16+’ సర్టిఫికేట్ జారీ చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌కు వెళ్లగా, సర్టిఫికేట్ జారీపై కోర్టు స్టే విధించింది. దీంతో సినిమా విడుదల నిలిచిపోయింది.

హైకోర్టులో ఇప్పటికే ఈ కేసు విచారణలో ఉన్నందున తాము ప్రస్తుతానికి ఇందులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఈ వివాదంపై తిరిగి మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌నే ఆశ్రయించాలని, అక్కడ తేల్చుకోవాలని సూచించింది.ఈ కేసును జనవరి 20న విచారించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది.విజయ్ రాజకీయాల్లోకి రాకముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ కోర్టు వివాదాల వల్ల సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.