
మన తెలంగాణ/హైదరాబాద్ : ఓ న్యూస్ ఛానెల్ కు చెందిన ముగ్గురు జర్నలిస్టులను బుధవారం సిట్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. పోలీసులు వారిని అదుపులోకి తీ సుకున్న తీరుతెన్నుల పట్ల విపక్షాలు, ప్రజాసంఘా లు, జర్నిలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అయితే తమ దర్యాప్తునకు సహకరించకుండా పారి పోయే ప్రయత్నం చేయడం వల్లనే వారిని అదుపులో కి తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ బృందానికి నేతృత్వం వహిస్తో న్న నగర పోలీసు కమిషనర్ సజ్జానర్ తన చర్యను స మర్థించుకున్నారు. ఇలా ఉండగా ఇటీవల సదరు చానల్‌లో ప్రసారం చేసిన కథనంలో ఒక మహిళా ఐఏఎస్ అధికారికి, సీనియర్ మంత్రికి సంబంధం అంటగట్టడాన్ని సివిల్ సర్వీసెస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథనాల వల్ల తమ మనస్థయిర్యం దెబ్బతింటుందని, పైగా మహిళా అధికారుల పట్ల నిరాధారంగా, అనైతికంగా ఆ కథనాన్ని ఏ ఆధారంతో ప్రసారం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సదరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తీవ్రంగా స్పందించి దీనిపై విచారణ జరిపించాల్సిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు సివిల్ సర్వీసెస్ అధికారుల సంఘం కూడా విచారణకు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కథనంతో పాటు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పై సోషల్ మీడియాలో వైరల్ అయిన ఉదంతంపై కూడా దర్యాప్తునకు ఆదేశిస్తూ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది.
రంగంలోకి దిగిన సిట్ బృందం సదరు చానల్‌కు చెందిన జర్నలిస్టులలో ఒకరిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అర్ధరాత్రి అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరిని వారి ఇళ్ళ నుంచి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడానికి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియకపోవడంతో ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, విపక్ష రాజకీయ పార్టీలలతో పాటు సంబంధిత చానల్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసారు. మరోవైపు సిట్ అధికారులు దర్యాప్తులో భాగంగా సదరు చానల్‌కు వెళ్లి కంప్యూటర్లను, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడానికి య్రపత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా చానల్ ఉద్యోగుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ పరిణామాల పట్ల ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీతో పాటు బీజేపి, వామక్ష పార్టీలు పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఇలా ఉండగా సదరు చానల్ కు చెందిన ముగ్గురిలో ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్, జర్నలిస్ట్‌లు సుధీర్, పరిపూర్ణచారిని పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం వారిలో పరిపూర్ణచారిని విచారించి వదిలేసారు. మిగతా ఇద్దరు దొంతు రమేష్, సుధీర్‌ను మాత్రం తమ అదుపులోనే ఉంచుకొని కింగ్ కోఠి హస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయే ప్రయత్నం చేసారు : సిపి సజ్జనార్
ఒక మహిళా ఐఎఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో విచారణలో భాగంగా ఒక చానల్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టులో అదుపులోకి తీసుకున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సిపి సజ్జనార్ మీడియాకు తెలిపారు. మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించకుండా తమ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయే ప్రయత్నం చేయడం వల్లనే వారిని అదుపులోకి తీసుకున్నట్టు ఆయన వివరించారు. సదరు టీవీ చానెల్ సిఇఒ ఎక్కడ ఉన్నారు? పిలిస్తే విచారణకు రావాలి కదా అని ప్రశ్నించారు. ఏ తప్పు చేయని పక్షంలో సదరు చానల్ రిపోర్టర్లు ఎందుకు పారిపోవాల్సిన అవసరం వచ్చిందని సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అప్పటి కప్పుడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నించడం వల్లనే సదరు చానల్ కు చెందిన ఒకరిని ఎయిర్‌పోర్టులో తమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.విచారణకు పిలిస్తే వస్తానని చెప్పి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే అన్ని వివరాలు వెల్లడించనున్నట్టు సిపి సజ్జనార్ తెలిపారు.
పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరం : సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్
ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పూర్వ అధ్యక్షుడు , మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి తీవ్రంగా ఖ ండించారు. ఓ జర్నలిస్టు మెడల మీద చేయివేసి పోలీసులు లాక్కపోవడం కచ్చితంగా అభ్యంతరకర మని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ చర్య కచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేదేనని అభిప్రాయపడ్డారు.చాలా సందర్భా ల్లో పోలీసులు ప్రభుత్వాలకు చెడ్డపేరు వచ్చే విధంగానే వ్యవహరిస్తుండటం పరిపాటి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ న్యూస్ చానల్‌లో కొద్ది రోజుల క్రితం ప్రసారమైన ఒక కథనం అసత్యం కావొచ్చు.. అనైతికం కావొచ్చు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ల వ్యక్తిత్వ హననానికి ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా కుట్ర పన్ని ఉండవచ్చనని అన్నారు. దాని మీద చర్యలు ఉండాల్సిందే నని అన్నారు. ఈ చర్యలు చట్టబద్ధంగా ఉండాలన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులలో ఒకరిని వైద్య పరీక్షలకు తీసుకువస్తున్న సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరమని దేవులపల్లి అమర్ ఖండించారు.