
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక మూవీ ‘రాజా సాబ్‘. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కించారు దర్శకుడు మారుతి. ‘రాజా సాబ్‘ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి కానుకగా శుక్రవారం ‘రాజా సాబ్‘ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ: రాజు (ప్రభాస్) తల్లిదండ్రులను కోల్పోయిన కుర్రాడు. అతడికి తన నానమ్మ గంగాదేవి (జరీనా వాహబ్) అంటే పంచ ప్రాణాలు. అయితే అనారోగ్యం పాలై అల్జీమర్స్ తెచ్చుకున్న గంగాదేవి.. ఎన్నో ఏళ్ల ముందు తనను వదిలి వెళ్లిపోయిన భర్త కనకరాజు (సంజయ్ దత్) కోసం వేచి చూస్తుంటుంది. ఆమె కోసం ఎలాగైనా తన తాతను వెతికి తీసుకురావాలని తాను ఉన్న ఊరి నుంచి హైదరాబాద్ బయల్దేరతాడు రాజు. అక్కడ తాతను వెతికే క్రమంలో.. సిటీకి దూరంగా అడవిలో పాడుబడ్డ బంగ్లాలోకి రాజు అతడి మిత్ర బృందం వెళ్తుంది. అక్కడే తన తాత గురించి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి రాజుకు. ఆ విషయాలేంటి.. అతడి తాతకు ఏమైంది.. తన నానమ్మ కోరికను రాజు తీర్చగలిగాడా.. ఈ సంగతులన్నీ తెర మీదే తెలుసుకోవాలి.
కథనం, విశ్లేషణ: ‘రాజా సాబ్’ సినిమా డార్లింగ్ హీరో ప్రభాస్ అభిమానులకి ఎంతో కాలం నుంచి మిస్ అవుతున్న వింజ్ ట్రీట్‌ని అయితే అందిస్తుంది అని చెప్పొచ్చు. ప్రభాస్ వన్ మ్యాన్ షోతో ఈ సినిమాని తన భుజస్కంధాలపై మోసుకొచ్చాడు. తన కామెడీ టైమింగ్, తనపై కొన్ని కామెడీ ట్రాక్ డైలాగ్‌లు ఆడియెన్స్‌ని మెప్పిస్తాయి. అయితే హార్రర్ కామెడీ సినిమాలు తీయడంలో మారుతి నైపుణ్యం ఎలాంటిదో పుష్కరం కిందటే ‘ప్రేమకథా చిత్రమ్’లో చూశాం. కానీ మారుతి ప్రేక్షకుల అంచనాలకు మించి ఏదో చేయాలని.. తనకు పట్టున్న అంశాలను వదిలేసి.. హార్రర్ కథతో ఒక సైకలాజికల్ గేమ్ ఆడాలని చూశాడు. ఆ కాన్సెప్ట్ కొత్తగా అనిపించినా.. దాన్ని సరిగా డీల్ చేయలేక గందరగోళంగా మార్చేయడంతో ‘రాజాసాబ్’ ప్రేక్షకుల అంచనాలకు దూరంగా నిలిచిపోయింది. ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత జోష్ ఉన్న.. ఎనర్జిటిక్‌గా అనిపించే ఫుల్ లెంత్ రోల్‌లో కనిపించడం అభిమానులను సంతోషపెట్టినా.. కొన్ని ఎపిసోడ్ల వరకు ఆకట్టుకున్నా.. సుదీర్ఘ నిడివితో సాగే ‘రాజాసాబ్’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
‘రాజాసాబ్’ మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమా. ఇంత సుదీర్ఘ నిడివిలో కూడా కథేంటో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పకపోవడం.. ఏ పాత్రనూ సక్రమంగా చూపించలేకపోవడం ఈ సినిమాకున్న అతి పెద్ద సమస్య. ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ అంశం మాత్రం మారుతి రైటింగ్ అని చెప్పక తప్పదు. తను ఈ సినిమా ఫస్టాఫ్ నుంచే కథనం బలహీనంగా నడిపించాడు. ఫస్టాఫ్ లో చాలా వరకు సీన్స్ బలవంతంగా ఇరికించిన భావన చూసే ఆడియెన్స్ లో కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో అందరూ కలసి రాజ మహల్ కు చేరుకున్నాక.. సంజయ్ దత్ సన్నివేశాలు కొన్ని ఆసక్తికరంగా అనిపించినా… దర్శకుడు అసలేం చెప్పదల్చుకున్నాడో ఎవరికీ అర్థం కాదు. దర్శకుడు మారుతి ఏకంగా ముగ్గురు హీరోయిన్లను పెట్టి రొమాంటిక్ ట్రాక్స్ నడిపించాడు.
కమేడియన్లను పెట్టి నవ్వించడానికీ ప్రయత్నించాడు. కానీ ఇటు రొమాన్సూ పండలేదు. అటు కామెడీ పెద్దగా పేలలేదు. ఇంకోవైపు హార్రర్ ఫ్యాక్టర్ సైతం పెద్దగా పని చేయలేదు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అందాల ప్రదర్శనలో పోటీ పడ్డారు. వాళ్లను అందుకోసమే పెట్టారనిపిస్తుంది. రిద్ధి కుమార్ క్యారెక్టర్ అయితే పూర్తిగా తేలిపోయింది. సంజయ్ దత్, జరీనా వాహబ్ ఇద్దరికీ కీలక పాత్ర దక్కాయి. వాళ్లిద్దరి నటన ఆకట్టుకుంటుంది. కానీ వారి పాత్రల చిత్రణ సరిగా లేదు. బొమన్ ఇరానీ కనిపించిన కాసేపు తన ప్రాధాన్యాన్ని చాటుకున్నాడు. సినిమా అంతా గజిబిజీగా ఉండి… డార్లింగ్ వీరాభిమానులను కూడా విసుగెత్తిపోయేలా చేసింది ‘రాజా సాబ్’. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌ని చేతిలో పెట్టుకుని ఓ సాధారణ హీరోతో సినిమా తీసినట్లు తీశాడు దర్శకుడు మారుతి. సగటు హార్రర్ కథకే ఒక డిఫరెంట్ టచ్ ఇవ్వాలని చూశాడు. ఈ కథకు స్క్రీన్ ప్లే సరిగా కుదరలేదు. సగటు కమర్షియల్ సినిమాలా అన్నీ మిక్స్ చేయాలని చూడడం ప్రతికూలంగా మారింది. మొత్తానికి ‘రాజా సాబ్’కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.