
ఇటీవల కొందరు ఉపాధ్యాయులే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడటం, ఆ దారుణాలను కప్పిపుచ్చడం వంటి వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నవారికి బహుశా ‘లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం, 2012’ (పోక్సో చట్టం) గురించి అవగాహన ఉండి ఉండదు. 18 ఏళ్లలోపు బాల, బాలికలందరికీ రక్షణ కల్పించే ఈ చట్టం ఎంత కఠినమైనదో అందరూ తెలుసుకోవాలి. ఉపాధ్యాయులే లైంగిక దాడికి పాల్పడితే దాన్ని ‘అగ్రవేటెడ్’ నేరంగా పరిగణిస్తారు. కనీసం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష నుంచి మరణశిక్ష వరకూ శిక్ష విధించే అధికారాలు న్యాయస్థానాలకు ఉన్నాయి.
ఈ చట్టం కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురికి ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు విచారణను అత్యంత వేగంగా పూర్తి చేసి మరణ శిక్షలు విధించాయి. ఈ చట్టంలో కీలకమైన అంశం – నేరం జరగలేదని నిరూపించుకోవాల్సిన భారం నిందితులపై ఉంటుంది. అలాగే, సెక్షన్ 19 ప్రకారం, పాఠశాలలో బాలలపై వేధింపులు జరిగినట్లు తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్పనిసరి. ఈ నేరాలను దాచిపెట్టేవారు కూడా చట్టం దృష్టిలో నిందితులే.
చైల్డ్ సేఫ్టీ పాలసీ అమలు చేయాలి
ఉపాధ్యాయులు కూడా కొన్ని వృత్తిపరమైన జాగ్రత్తలను పాటించడం ద్వారా అపార్థాలకు, తప్పుడు ఆరోపణలకు తావులేకుండా చూసుకోవచ్చు. విద్యార్థితో ఒంటరిగా మాట్లాడవలసి వచ్చినప్పుడు, తలుపులు తెరిచి ఉంచడం, ఇతరులకు స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లోనే సంభాషించడం క్షేమం. మూసి ఉన్న గదిలో, విద్యార్థితో ‘ఒంటరిగా మాట్లాడకపోవడం’ వంటి నియమాలను కచ్చితంగా పాటించాలి. ఏదైనా సందర్భంలో ఒక విద్యార్థిని ఒంటరిగా కలవాల్సి వస్తే, అక్కడ తప్పనిసరిగా మరొక వ్యక్తి (వేరొక ఉపాధ్యాయులు) ఉండేలా చూసుకోవాలి.
ఎక్స్‌కర్షన్లు లేదా క్రీడా సమయాల్లో ఇద్దరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. డిజిటల్ పరిధులను కూడా గీసుకోవాలి. వ్యక్తిగత ఫోన్ లేదా సోషల్ మీడియా ఖాతాల ద్వారా నేరుగా విద్యార్థితో చాట్ చేయడం కన్నా – ఏ సమాచారమైనా అధికారిక పాఠశాల గ్రూపుల ద్వారానే పంచుకోవడం ఉత్తమం. పాఠశాలలు సిబ్బందిని విధుల్లోకి తీసుకునే ముందు పోలీసు వెరిఫికేషన్ ద్వారా వారి నేర చరిత్రను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. పటిష్టమైన చైల్డ్ సేఫ్టీ పాలసీ అమలు చేయాలి. అలాగే, బాలల ప్రవర్తన, భావోద్వేగాలు, శారీరక స్థితిలో వచ్చే మార్పుల సరళిని ఉపాధ్యాయులు నిశితంగా గమనించాలి.
పిల్లల రక్షణ కోసమే చైల్డ్ లైన్ 1098
ఎప్పుడూ చురుకుగా ఉండే విద్యార్థి అకస్మాత్తుగా మూగబోవడం, భయపడటం, చదువులో ఏకాగ్రత లోపించడం లేదా వయసుకు మించిన లైంగిక విషయాలు మాట్లాడటం వంటివి ప్రమాద ఘంటికలుగా భావించాలి. తరగతి గదిలో అకారణంగా ఏడవడం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, ఆటల్లో పాల్గొనకపోవడం, కూర్చోవడానికి ఇబ్బంది పడటం, ఎవరినైనా వ్యక్తిని చూసి భయపడటం వంటివి వేధింపులకు సంకేతాలు కావచ్చు. బాలల్లో చైల్డ్ లైన్ (1098), 112 (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్), ‘112 ఇండియా’ ఆప్-లపై అవగాహన పెంచాలి.
ఏది సురక్షితమైన స్పర్శ, ఏది అసురక్షితమైన స్పర్శ అనేది స్పష్టంగా నేర్పించాలి. ఎవరైనా తప్పుగా తాకితే గట్టిగా వద్దు అని చెప్పే ధైర్యాన్ని, అక్కడి నుంచి పారిపోయే తెగువను వారికి ఇవ్వాలి. అలాగే, రహస్యాల వల్ల చెడు జరిగే ప్రమాదం ఉందని, వాటిని వెంటనే నమ్మకమైన పెద్దలకు చెప్పాలని పిల్లల మెదళ్లలో నాటుకునేలా నేర్పించాలి. బాలల పట్ల లైంగిక దాడి సమాచారం తెలియగానే రిపోర్ట్ చేయవలసిన బాధ్యతను ఉపాధ్యాయులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కొద్దిమంది చేస్తున్న నేరాల వల్ల, పవిత్ర ఉపాధ్యాయ వృత్తికి కళంకం రాకుండా చూసుకోవడం అందరి బాధ్యత.
– శ్రీనివాస్ మాధవ్
‘51A అభీ ఫౌండేషన్’ వ్యవస్థాపక సభ్యుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.