
హైదరాబాద్ లో జనాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో దోమల బెడద ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇళ్ళు, రోడ్లు, గ్రౌండ్లు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా దోమలు విపరీతంగా ఉంటున్నాయి. హైదరాబాద్ లో దోమల బెడదపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దోమల బెడదపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గురువారం ( ఏప్రిల్ 2 ) అసెంబ్లీ మీడియా హాల్ లో దోమతెరతో కుట్టిన డ్రెస్ తో ప్రెస్ మీట్ కి హాజరయ్యారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ లో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయని అన్నారు సుధీర్ రెడ్డి.
దోమలతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని… తమ హయంలో నాలుగు , ఐదు సార్లు దోమల బెడద లేకుండా చర్యలు తీసుకునే వాళ్ళమని..దోమలు పై ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. దోమల ద్వారా డెంగ్యూ, మలేరియాతో పేద ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని.. దోమలు అరికట్టలేని ప్రభుత్వం అవసరమా అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు సుధీర్ రెడ్డి.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నపుడు మాత్రమే కొన్ని నిబంధనలు ఉంటాయని..దోమల బెడద పై అసెంబ్లీ మీడియా హాల్లో దోమ తెరతో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటే మార్షల్స్ అడ్డుకున్నారని అన్నారు. హైదరాబాద్ ను మూడు ముక్కలు చేసి మరిన్ని సమస్యలకు కారణం చేశారని అన్నారు. దోమల బెడదకు భయపడి ఎవరు హైదరాబాద్ రావడం లేదని..హైదరాబాద్ లో దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు సుధీర్ రెడ్డి.
దోమల బెడదను అరికట్టకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు సుధీర్ రెడ్డి. తన ప్రెస్ మీట్ ను అడ్డుకున్న మార్షల్స్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రతి డివిజన్ కు 10 ఫాగింగ్ మిషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటున్నారంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలు దోమ తెర కుట్టించుకునే పరిస్థితి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని..కరోనా వచ్చినప్పుడు మాస్క్ ఎలా పెట్టుకున్నామో , హైదరబాద్ లో దోమల బెడద తట్టుకోలేక దోమ తెర కుట్టించుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు సుధీర్ రెడ్డి.