
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు కాషాయమయంగా మారింది. బుధవారం నుంచి హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం కావడంతో భక్తులు, మాలధారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు కొండగట్టుకు చేరుకున్నారు. ఇరుముడితో కొండకు చేరుకున్న మాలధారులు ముందుగా కోనేరులో స్నానం చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల రద్దీ కారణంగా వై జంక్షన్ నుంచి వాహనాల రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా వై జంక్షన్ నుంచి జేఎన్‌టీయూ వరకు పది పార్కింగ్ ప్లేస్‌లను ఏర్పాటు చేశారు. బుధవారం సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. గురువారం హనుమాన్ జయంతి నేపథ్యంలో లక్ష మంది వరకు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో తాగునీటి సౌకర్యం కోసం 20 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
చలువపందిళ్లు కూలడంతో పలువురికి గాయాలు
హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టులో తలనీలాలు తీసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో చలువ పందిళ్లు వేశారు. బుధవారం తెల్లవారుజామున గాలికి చలువ పందిళ్లు కూలిపోవడంతో పలువురు భక్తులు, సిబ్బందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు.