
15 రోజుల పాటు బెంగాల్‌లోనే ఉంటానని.. మమత సర్కార్‌ను గద్దె దించుతామని అమిత్ షా సవాల్ విసిరారు. సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. తాను రాబోయే 15 రోజుల పాటు బెంగాల్‌లోనే ఉంటానని కీలక ప్రకటన చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
సువేందు అధికారి నామినేషన్ కోసమే ప్రత్యేకంగా బెంగాల్‌కు వచ్చానని.. సువేందు విజయం బెంగాల్‌లో మార్పునకు పునాది వేస్తుందన్నారు. గతసారి నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపూర్‌తో పాటు యావత్ బెంగాల్‌లోనూ ఓడిపోతారని జోస్యం చెప్పారు. సువేందు అధికారి నామినేషన్ బెంగాల్‌లో టీఎంసీ పతనానికి నాంది అని అన్నారు. ఈసారి నందిగ్రామ్ ప్రజలు చరిత్రను పునరావృతం చేసి మమతా బెనర్జీని అధికారం నుంచి గద్దె దించుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్
తాను బెంగాల్ రాష్ట్రమంతా పర్యటించానని, తాను వెళ్లిన ప్రతిచోటా ఒకే స్వరం విన్నానని పేర్కొన్నారు. మమతా బెనర్జీకి వీడ్కోలు పలకండి. ప్రభుత్వానికి వీడ్కోలు పలకండి. మమతా బెనర్జీకి గుడ్ బై చెప్పండి అనే ఒకే స్వరం మాత్రమే తనకు వినిపించిందని పేర్కొన్నారు. దోపిడీ, గూండాయిజంతో బెంగాల్ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఆరోపించారు. తరచుగా జరుగుతున్న బాంబు పేలుళ్లు, నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతోందన్నారు. టీఎంసీ ప్రభుత్వం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందని.. దీంతో రాష్ట్ర జనాభా స్వరూపాన్ని మారుస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని నిర్మూలించి.. నూతన అభివృద్ధిని తీసుకువస్తామని..తద్వారా బెంగాల్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలదని అమిత్ షా యువతకు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికా నాశనం కావాలని కోరుకున్న వారి అంతు చూశాం