
తెలంగాణలోని లంబాడీలు జరుపుకునే అతి పెద్ద జాతరలలో లోక మసంద్ జాతర ముందు వరుసలో ఉంటుంది. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో చైత్ర పౌర్ణమి (ఏప్రిల్) సందర్భంగా జరిగే ఈ జాతరలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లోని లంబాడీలు, గిరిజనేతరులు లక్షలాదిగా పాల్గొని జాతరను వైభవంగా జరుపుకుంటారు. శ్రీ లోక మసంద్ తిమ్మారెడ్డిపల్లెలోనే పుట్టాడని కొందరు, రాజస్థాన్‌లో పుట్టాడని కొందరు చెప్తుంటారు. ఆయన పదిపన్నెండు సంవత్సరాల వయసులోనే పశువులను మేపుతూ తోటి బాలురకు, లంబాడీ తండావాసులకు పలు మహిమలు ప్రదర్శించి, వారి బాధలు తీర్చి, బోధలు చేసి మహనీయుడయ్యాడని చెప్తారు. అనంతరం ఆయన రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘడ్‌లో పుష్కర కాలం తపస్సు చేసి కాళికా మాతను ప్రసన్నం చేసుకున్నాడట.
అనంతరం క్రీ.శ. 1700 ప్రాంతంలో పంజాబ్‌లోని అమృత్సర్‌లో ఉన్న దేవాలయంలో గురుతేజ్ బహదూర్ సింగ్ దగ్గర కొంతకాలం శిష్యరికం చేశాడు. ఆయనను 1708లో మొఘల్ సామ్రాట్ ఉరి తీసిన తరువాత ఆయన వారసుడు గురు గోవింద్ సింగ్ దగ్గర నాందేడ్‌లో 6 సంవత్సరాలు శిష్యరికం చేసి ఏడుగురు మసంద్ (దశవంద అనే ధార్మిక శిస్తును వసూలు చేసే శిష్యుడు) లలో ఒకడిగా గుర్తింపు పొంది పలు విద్యలు నేర్చుకున్నాడు. ఇతర సిక్కులు అసూయతో లోక మసందును చంపే ప్రయత్నం చేయగా గురు గోవింద్ ప్రసాదించిన జల్దీ ఘోడ్ (గుర్రం) ఎక్కి వచ్చి తెలంగాణలోని తిమ్మారెడ్డిపల్లి సమీపపు కోయిల్సాగర్ వాగు సంగమంలో స్నానం చేసి, అక్కడి పరుపు బండ మీద తపస్సు చేశాడట. ఆ పరుపు బండ మీది ఆయన పాదముద్రలు, ఆయన గుర్రపు డెక్కల ముద్రలను భక్తులు ఇప్పటికీ దర్శించుకుంటారు.
శ్రీ లోక మసంద్ సమీపంలోని మారేడు చెట్టు కింద తపస్సు చేస్తూ, భక్తులకు బోధలు చేసేవారు. మద్యమాంసాల సేవనం వల్ల కుటుంబ జీవితాలు నాశనమవుతాయని, కాబట్టి వాటిని విసర్జించి నైతిక జీవితం గడపాలని, హిందూ మత ధర్మ పరిరక్షణకై కృషి చేయాలని బోధించేవారట. చివరకు జీవసమాధి అయి, కొన్ని గడియల తరువాత చూడగా గులాబీ పూల మధ్య కలశం లాగా గోచరించాడట. దాని మీదే భక్తులు సమాధి మందిరం కట్టారు. దాని స్థానంలో రెండున్నర శతాబ్దాల తరువాత.. యాభై ఏండ్ల కిందట.. 1976లో విశాలమైన ఆలయం నిర్మించారు. పక్కన్నే మాత మందిరం కట్టారు. అప్పట్నుంచి గత అర శతాబ్ద కాలంగా నిరంతరాయంగా చైత్ర పౌర్ణమికి జాతర జరుపుతున్నారు.
గురు లోక మసంద్ మహరాజ్ రెండవ అన్న డాకు మహారాజ్ కుమారుడు శ్రీ రాంజీ మహారాజ్ అన్నీ తానై పూజలు, సేవలు చేస్తూ దేవాలయ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు.తదుపరి రాంజీ మహారాజుకు నిజాం ప్రభుత్వం కాలంలో దేవాలయ నిర్మాణానికి, పూజలు చేసుకోవడానికి సర్వే నెం. 41లో 2 ఎకరాల 38 గుంటల భూమిని మక్తేదార్ అయిన గత్ప రాంచందర్ రావు సనద్ రాసి ఇచ్చారు. తదుపరి రాంజీ మహారాజ్ కుమారులు అయిన 1) గంగు మహరాజ్ (అవివాహితుడు), 2) భద్రు బావాజీ, 3) లచ్చిరాం బావాజీలకు కూడా పూజలు చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మక్తేదారు గత్ప రాంచందర్రావు అన్ని హక్కులు కల్పిస్తూ మరో సనద్ వాసి ఇచ్చారు. దాంతో భద్రు బావాజీ, ఆయన తమ్ముడు లచ్చిరాం బావాజీ ఎంతో కష్టపడి దేవాలయం, మండపాలు, ధర్మశాలలు, కాళికాదేవి ఆలయం, మండపం మొదలైన పనులు చేశారు. వారి తదనంతరం వారి కుమారులు, వారి వంశస్థులు దేవాలయ పూజలు, వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉండి నేటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు.
తదుపరి భద్రు బావాజీ మనుమడు శ్రీరాములు నాయక్ (రాములు మహారాజ్), లచ్చిరాం బావాజీ కొడుకు హన్మ్యా నాయక్ (హన్మంతు మహారాజ్) గారలను ఒ.ఎ. నెం. 29/ 2006, తేది: 15 మే, 2009 ద్వారా దేవాదాయ శాఖ వారు వంశపారంపర్య ధర్మకర్తలుగా నియమించారు. వారు ఇరువురి మరణాంతరం హన్మంతు మహరాజ్ కొడుకులు, వారి తమ్ముడు తుక్యా నాయక్ కొడుకులు, రాములు నాయక్ (రాములు మహరాజ్) కొడుకులు, తమ్ముళ్లు (భాగస్థులు) కీ.శే. కిషన్ నాయక్ కొడుకులు, కీ.శే. హిరాలాల్ కొడుకు, తమ్ముళ్లు ధన్ను నాయక్, దేవులా నాయక్… వీరు దేవాలయ కార్యక్రమాలను నిర్వహిస్తూ వంశపారంపర్య పూజారులుగా, ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజులలో జరిగే శ్రీ గురు లోక మసంద్ ప్రభు బ్రహ్మోత్సవాల(జాతర)లో లంబాడీ గిరిజనులు, గిరిజనేతర భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. స్వామివారి దర్శనం అనంతర మాతకు మొక్కి కోళ్లు, మేకలు కోసుకొని విందు చేసుకుంటారు. ఒక అంచనా ప్రకారం ప్రతి జాతరలో యాభై నుంచి అరవై వేల మేకలను బలిస్తారట. దీన్ని బట్టి భక్తజన సందోహం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం (తేరు) మిరుమిట్లుగొలిపే బాణసంచాల పేలుళ్ల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రత్యేక అలంకరణలతో, బ్యాండ్ మేళతాళాలతో ప్రభు వారి పల్లకిసేవ జరుగుతుంది. కాళికాదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, హోమం (భోగ్ భండార్), కుంకుమార్చన, పల్లకీ సేవ జరుగుతుంది. జాతరలో ఎన్నో అద్భుత దృశ్యాలు, ప్రభు వారి మహిమలు భక్తులకు సాక్షాత్కరిస్తాయనే విశ్వాసం ఉంది. సాంప్రదాయ నృత్యాలు, బంజార ఆట పాటలు, భజనలు భక్తులను తన్మయత్వానికి గురి చేస్తాయి. భక్తులు ప్రభు వారికి పూలమాలలు, ప్రత్యేక వస్త్రాలు (గాది), మహా భోగ్ భండార్ (నైవేద్యాలు), వెండి, బంగారం సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతర ప్రాధాన్యాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 1 ఏప్రిల్ 2026 న ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి అవసరమైన నిధులను విడుదల చేస్తున్నది.
– డా. ద్యావనపల్లి సత్యనారాయణ
94909 57078