
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఇంట్లో నమ్మకంగా ఉన్న పనిమనిషే డబ్బుపై వ్యామోహంతో కూతురుతో కలిసి చోరీఈ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పనిమనిషిని అరెస్ట్ చేసి దోచుకున్న నగలను రికవరీ చేశారు. బుధవారం ఆదిలాబాద్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ మండలం అడేగాంకు చెందిన దేవల లక్ష్మి స్థానిక టీచర్స్ కాలనీలో నివసిస్తున్న ఉపాధ్యాయుడు పవార్ ప్రేమ్సింగ్ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. గత నెల 18న ప్రేమ్సింగ్తన కుటుంబంతో కలిసి ఫంక్షన్‌కు వెళ్లారు.
దీంతో ప్రణాళిక ప్రకారమే లక్ష్మి ముందుగానే ఇంటి వెనకాల గది తలుపునకు గడియ పెట్టలేదు. అనంతరం తన మైనర్కూతురితో కలిసి ఇంట్లో నుంచి పది తులాల బంగారం, పది తులాల వెండిని దొంగిలించింది. ఈ నెల 26న బీరువా తీసి చూసే సరికి నగలు లేకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పనిమనిషే అసలు దొంగ అని గుర్తించి ఆమెను అరెస్ట్ చేసి దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. కేసును ఛేదించిన ఎస్‌హెచ్‌వో బండారి రాజు, ఎస్సై రమేశ్, సిబ్బంది రుక్మారెడ్డిని ఎస్పీ అభినందించారు.