Reading Time: 2 minutes
Cm Chandrababu Hails Amaravati Bill Calls For Statewide Celebrations After Rajya Sabha Approval

ఎన్డీయే నేతలతో సీఎం చంద్రబాబు గురువారం ఉదయం టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. రాజ్యసభలో మన రాజధాని అమరావతి బిల్లు నేడు ఆమోదం పొందబోతోందని, ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోందని సీఎం అన్నారు. సాయంత్రం అన్ని గ్రామాల్లో పండగలా సంబరాలు చెయ్యాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన రీతిలో రాజధాని సంబరాలు జరపుకునే సమయమిదని, ఇవాళ అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ప్రతి ఒక్కరూ కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలన్నారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొన్నారు.

‘రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోంది. రాజ్యసభలో మన రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోంది. కేంద్ర సహకారంతో పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందుతోంది. అమరావతికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన అతి తక్కువ సమయంలోనే బిల్లును ప్రవేశపెట్టింది. అమరావతి మనకు ఒక సెంటిమెంట్. 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారు. అమరావతి పట్ల వారికున్న ద్వేషానికి ఇది పరాకాష్ట. అమరావతి పేరు పలకడానికేవైఎస్ జగన్ ఇష్టపడరు. అందుకే మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చారు. అమరావతి పేరు వింటేనే జగన్‌కు కంపరంగా ఉండి నిత్యం విషం కక్కుతున్నాడు. అమరావతి పట్ల జగన్ వైఖరి భవిష్యత్‌లోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైంది’ అని సీఎం మండిపడ్డారు.

Also Read: IPL 2026 Coincidences: ఐపీఎల్ 2026లో అరుదైన సంఘటనలు.. అభిమానులను ఆశ్చర్యపరుస్తోన్న ఫలితాలు!

‘మా రాజధాని అమరావతి అని ప్రతీ ఒక్కరిలో భావన రావాలి. బిల్లు ఆమోదించి చేయూత ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు. రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ పూర్తయినట్లే. బిల్లు పాస్ అయినందుకు ఈ రోజు సాయంత్రం అన్ని గ్రామాల్లో పండుగలా కార్యక్రమాలు జరపాలి. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన రీతిలో రాజధాని సంబరాలు జరపుకునే సమయమిది. ఇవాళ అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ప్రతి ఒక్కరూ కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలి. నేను మధ్యాహ్నం రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెనికి వెళ్తున్నాను. రాజధాని సంబరాల్లో పాల్గొంటున్నాను. దేశంలోని వివిధ పుణ్యస్థలాల నుంచి తెచ్చిన నీళ్లు, మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతం ఉద్దండరాయునిపాలెం. మనం అనుకున్న అభివృద్ధి సవ్యంగా సాగాలని ప్రతి కోరుకోవాలి, సంకల్పం తీసుకోవాలి. మన రాజధానికి స్థిరత్వం వచ్చేలా సహకరించిన ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, మద్ధతు తెలిపిన వారికి కృతజ్ఞతలు. గత ఐదేళ్లు మీకు 3 రాజధానులా అని ఎగతాళిగా మాట్లాడారు. ఏకైక రాజధాని నా రాజధాని అమరావతి అని గౌరవంగా చెప్పుకునే రోజు వచ్చింది. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కూడా సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేస్తాం. అన్ని రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోంది’ అని సీఎం చెప్పుకొచ్చారు.